పాలస్తీనా పరిస్థితిని ప్రతిబింబిస్తున్న 12 ఏళ్ల ర్యాపర్ సాంగ్

by  |
పాలస్తీనా పరిస్థితిని ప్రతిబింబిస్తున్న 12 ఏళ్ల ర్యాపర్ సాంగ్
X

దిశ, ఫీచర్స్ : జెరూసలెంలో నెల రోజులుగా జరుగుతున్న గొడవలు ఇప్పుడు కొత్తగా పుటుకొచ్చినవేం కావు. అక్కడ దశాబ్దాలుగా వివాదం కొనసాగుతుండగా.. ప్రస్తుతం ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తుండటమే కాక వేల మంది గాయపడుతున్నారు. ప్రజలంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని కాలం గడుపుతుండగా.. పసిపిల్లల చావు దృశ్యాలు చూసి ప్రపంచమంతా కన్నీళ్లు పెట్టుకుంటోంది. రెండు దేశాల మధ్య ఘర్షణలు ‘భారీ యుద్ధానికి’ దారితీసే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలో 12 ఏళ్ల ర్యాపర్ ‘మనందరికీ శాంతి’ కావాలంటూ ఓ ర్యాప్ సాంగ్ పాడాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

పాలస్తీనాలో ప్రస్తుత పరిస్థితిని ఎత్తిచూపడానికి ఒక చిన్న పిల్లవాడు ర్యాప్ వీడియో చేశాడు. ‘పాలస్తీనా దశాబ్దాలుగా ఆక్రమించబడింది, కానీ శతాబ్దాలుగా ఇది నా ఇల్లు. ఈ భూమి తరతరాలుగా నా కుటుంబ జ్ఞాపకాలతో విలసిల్లింది’ అంటూ తన బాధను, అక్కడి దుస్థితిని అక్షరాలుగా కూర్చిన ర్యాప్.. ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. తన పాట ‘గాజా’ పరిస్థితికి అద్దం పడుతోంది. 2 మిలియన్లకు పైగా వీక్షణలను సంపాదించిన ఈ వీడియోలో, 12 ఏళ్ల అబ్దుల్ రెహ్మాన్ ప్రజల ఘోషను వినిపిస్తూ శాంతి స్థాపన కోసం ప్రార్థించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో విస్తృతంగా షేర్ చేస్తుండటం విశేషం.

‘గత వారం నా ఇంటికి # గాజా సిటీకి చాలా కష్టమైంది. # పాలస్తీనాలోని పరిస్థితి గురించి ప్రపంచం తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందుకు వారధిగా పనిచేస్తున్న సంగీతం.. ఈ విషయాన్ని ప్రపంచానికి చాటిచెబుతోంది. ఇందుకు సాయపడ్డందుకు #Ireland లోని @GMCBeats కు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండండి. మాకు కావలసింది # శాంతి(పీస్)’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో రెహ్మాన్ పేర్కొన్నాడు.

ఇక10 ఏళ్ల నదీన్ అబ్దుల్ తైఫ్​కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పిన మాటలు కూడా అందరి హృదయాలను ద్రవింపజేస్తున్నాయి. ‘ఏం చేయాలో తెలియడం లేదు. నేనేం తప్పు చేశానని ఈ దుస్థితి. ఈ పరిస్థితులను ఎలా సరిచేయాలి? నాకు 10 సంవత్సరాలు. నేను ఈ కష్టాన్ని ఇంక భరించలేను’ అంటూ మిడిల్ ఈస్ట్ ఐ అనే వార్తా సంస్థతో తైఫ్ చెప్పిన మాటలు నిజంగా కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా నిలిచింది.

Next Story