ఆయన ఒక్క కాల్ చేస్తే చైనా వెనక్కి పోయే!

by  |
ఆయన ఒక్క కాల్ చేస్తే చైనా వెనక్కి పోయే!
X

న్యూఢిల్లీ: జాతీయ భద్రత సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి, స్టేట్ కౌన్సిల్ వాంగ్ యీలు ఫోన్‌లో మాట్లాడిన తర్వాత గాల్వన్ లోయలో ఎల్ఏసీ నుంచి ‘డ్రాగన్’ ఆర్మీ ఒక కిలోమీటర్లు వెనక్కి తరలివెళ్లింది. సరిహద్దులో ఉద్రిక్తతలు సద్దుమణిగేలా వేగంగా చర్యలు తీసుకోవాలని, ఎల్ఏసీలో శాంతియుత వాతావరణం నెలకొనేలా వ్యవహరించాలని ఈ సంభాషణలో ఇరువురు అంగీకరించారు. దేశాధినేతల మధ్య కుదిరిన ఏకాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవడానికి, విభేదాలు వివాదాలు కాకుండా జాగ్రత్తపడటానికి అంగీకరించినట్టు కేంద్రం వెల్లడించింది. ఎల్ఏసీ యథాతథ స్థితిని గౌరవించాలని, ఏకపక్షంగా ఎటువంటి మార్పులను చేయరాదన్న షరతులపై ఏకాభిప్రాయనికి వచ్చారని తెలిపింది. సరిహద్దు నుంచి ఇరుపక్షాల సైన్యం త్వరితగతిన వెనక్కి వెళ్లి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు అంగీకరించినట్టు వివరించింది. సరిహద్దు గుండా బలగాల ఉపసంహరణ ప్రక్రియను వేగవంతంగా చేపట్టేందుకూ సంసిద్ధతను వ్యక్తం చేసినట్టు కేంద్ర సర్కారు ఓ ప్రకటనలో పేర్కొంది.

జూన్ 15న హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతంలో నిర్మించిన తాత్కాలిక నిర్మాణాలను కూల్చివేసి సుమారు ఒక కిలోమీటరు మేరకు చైనా ఆర్మీ వెనక్కి వెళ్లినట్టు సమాచారం. భారత సైనికులు వెనక్కి వచ్చి ఒక బఫర్ జోన్‌ను ఏర్పాటు చేసుకున్నట్టు తెలిసింది. ప్రధాని నరేంద్ర మోడీ లేహ్ ఆకస్మిక పర్యటన నేపథ్యంలో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి ఫోన్‌లో సంభాషించడం గమనార్హం. మూడు రౌండ్ల మిలిటరీ చర్చలు అసంపూర్తిగానే మిగలగా, సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో వీరి సంభాషణ జరిగింది.

Next Story

Most Viewed