అత్యధిక త్రైమాసిక ఆదాయం సాధించిన ఎయిర్‌టెల్

by  |
అత్యధిక త్రైమాసిక ఆదాయం సాధించిన ఎయిర్‌టెల్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 853.6 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 1,035.3 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. సెప్టెంబర్ త్రైమాసికంలోనూ కంపెనీ రూ. 763.2 కోట్ల నష్టాలను వెల్లడించింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 24.2 శాతం పెరిగి రూ. 26,518 కోట్లకు చేరుకుంది.

ఇటీవల కొత్త చందాదారులు పెరిగిన నేపథ్యంలోనే కంపెనీ అధిక ఆదాయాలను సాధించగలిగిందని తెలుస్తోంది. మెరుగైన కస్టమర్లను సాధించడంతో పాటు మెరుగైన డేటాను అందించిన క్రమంలో ఎయిర్‌టెల్ ఆర్పు(వినియోగదారుల సగటు ఆదాయం) డిసెంబర్ త్రైమాసికంలో రూ. 135 నుంచి రూ. 166కు పెరిగింది. ‘కంపెనీ దాదాపు 7 లక్షల కస్టమర్లను సంపాదించిందని, సామర్థ్యాలను పెంచేందుకు, వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నామని’ ఎయిర్‌టెల్ తెలిపింది.

ఈ త్రైమాసికంలో కంపెనీ 1.29 కోట్ల 4జీ కస్టమర్లను సాధించడంతో మొత్తం 4జీ కస్టమర్ల సంఖ్య 16.56 కోట్లకు చేరుకుంది. కంపెనీ మొత్తం కస్టమర్ల సంఖ్య 45.8 కోట్లు ఉంది. ‘గతేడాది మొత్తం కంపెనీ అస్థిరతను ఎదుర్కొంది. అయితే, డిసెంబర్ త్రైమాసికంలో బలమైన పనితీరును సాధించగలిగాము. ఎయిర్‌టెల్ పోర్ట్‌ఫోలియోలోని ప్రతి విభాగం పనితీరులో స్థిరంగా ఉంది. ఇది కంపెనీ అన్ని వ్యాపారా విభాగాల్లో మార్కెట్ వాటా వృద్ధిని ప్రతిబింబిస్తుందని’ భారతీ ఎయిర్టెల్ ఇండియా, సౌత్ ఏషియా ఎండీ, సీఈవో గోపాల్ విటల్ చెప్పారు. అంతేకాకుండా హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా 5జీ సేవలను విజయవంతంగా నిర్వహించడం గర్వంగా ఉందని ఆయన వెల్లడించారు.

Next Story

Most Viewed