ఏఐతో.. స్ట్రాబెర్రీ ‘పంట పండింది’

by  |
ఏఐతో.. స్ట్రాబెర్రీ ‘పంట పండింది’
X

దిశ, ఫీచర్స్: కంప్యూటర్స్‌, మొబైల్స్‌లో బోలెడు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ గేమ్స్ ఉంటాయని అందరికీ తెలుసు. కొన్ని గేమ్స్‌‌లో మన సత్తా ఏంటో తెలుసుకోవడానికి స్నేహితులు, బంధువులతో కాకుండా ‘కంప్యూటర్’తో ఆడుతుంటాం. కంప్యూటర్‌పై విజయం సాధిస్తే ఆ కిక్కే వేరని సంబరపడిపోతుంటాం. ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే..చైనాలోని రైతులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పోటీపడుతూ ‘స్ట్రాబెర్రీ’ పంట పండించారు. రైతులకు-ఏఐకి జరిగిన ఈ పోటీలో ఎవరు గెలిచారు? ఏఐ వల్ల పంటల దిగుబడి పెరుగుతుందా? వ్యవసాయంలో టెక్నాలజీ ఉపయోగిస్తే వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి? అనే విషయాలు తెలుసుకుందాం.

వ్యవసాయంలో సాంకేతికత రోజురోజుకూ పెరుగుతోంది. లేటెస్ట్ టెక్ రివల్యూషనరీ ‘ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)’ని వ్యవసాయంలో ఉపయోగించి చైనా శాస్త్రవేత్తలు సక్సెస్ సాధించారు. ఇందుకోసం సంప్రదాయ రైతులు, సాంకేతిక బృందాలు మధ్య చైనాకు చెందిన లార్జెస్ట్ అగ్రి టెక్నాలజీ ప్లాట్‌ఫాం ‘పిండుడువో’ ఓ కాంపిటీషన్ నిర్వహించింది. ఇందులో భాగంగా నాలుగు నెలల పాటు స్ట్రాబెర్రీలను పెంచగా, డేటా విశ్లేషణ, ఇంటెలిజెంట్ సెన్సార్లు, గ్రీన్‌హౌజ్ ఆటోమేషన్ సహా మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వంటి సాంకేతికతను ఉపయోగించుకున్న టెక్ గ్రూప్స్, రైతులపై విజయం సాధించాయి. గ్రీన్‌హౌజ్ ఆటోమేషన్ ద్వారా ఉష్ణోగ్రతతో పాటు తేమను నియంత్రించగలిగితే, ఇంటెలిజెంట్ సెన్సార్ల సాయంతో నీరు, పోషకాల వాడకాన్ని నియంత్రించగలిగారు. దీంతో సంప్రదాయ రైతులతో పోలిస్తే డేటా శాస్త్రవేత్తలు సగటు బరువు పరంగా 196% ఎక్కువ స్ట్రాబెర్రీలను ఉత్పత్తి చేశారు. అంతేకాదు రాబడి ప్రకారం చూసుకున్నా టెక్ బృందాలు సగటున 75.5% పెట్టుబడిపై అధిక రాబడి సాధించాయి.

తొలిసారిగా జరిగిన ఈ ‘స్మార్ట్ అగ్రికల్చర్ పోటీ’ని చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పిండుడువో అనే టెక్ ప్లాట్‌‌ఫ్లాం నిర్వహించగా, ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ దీనికి టెక్నికల్ అడ్వైజర్‌‌‌గా ఉంది. టెక్ సాయంతో స్ట్రాబెర్రి పంటను పండించడం చాలా సింపుల్ అని, రాబడి పెరిగి, ఖర్చు చాలా తగ్గుతుందని, రైతులకు సమయం ఆదా అవుతుందని నిర్వాహకులు తెలిపారు. కాగా, ఏఐ వంటి ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ టెక్నాలజీస్ వ్యవసాయంలో ఉపయోగించడం వల్ల భారీ ఉత్పాదకత లాభాలు పొందవచ్చని గ్లోబల్ టెక్నాలజీ గవర్నెన్స్ రిపోర్ట్ -2021 అంచనా వేసింది. ఏఐ సాంకేతికత ఉపయోగించడం వల్ల ఆర్థిక వృద్ధి పెరుగుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి.



Next Story