ఆ మూడు దేశాలకు రవాణా నిలిపేసిన అదానీ పోర్ట్స్

by  |
ఆ మూడు దేశాలకు రవాణా నిలిపేసిన అదానీ పోర్ట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నౌకాశ్రయ సంస్థ అదానీ పోర్ట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలకు తమ నౌకాశ్రయాల నుంచి సరుకు రవాణాను నిలిపేస్తున్నట్టు సోమవారం వెల్లడించింది. ఈ నిర్ణయం నవంబర్ 15 నుంచి అమలవుతుందని, ఎంపిక చేసిన ఈ మూడు దేశాల నుంచి ఎలాంటి ఎగుమతులు, దిగుమతులు నిర్వహించబోమని అదానీ పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్ సోమవారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఇటీవల గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడిన కారణంగానే అదానీ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

అదానీ పోర్ట్స్ అండ్ సెజ్(ఏపీ సెజ్) నిర్వహించే అన్ని పోర్టులతో పాటు ఏపీ సెజ్ థర్డ్ పార్టీ టర్మినల్స్‌లో కూడా ఈ నిర్ణయం అమలవుతుందని తెలిపింది. తర్వాతి నోటీసులు వచ్చే వరకు ఈ నిర్ణయం అమలు కానున్నట్టు పేర్కొంది. అదానీ గ్రూప్ సంస్థకు మొత్తం ఏడు రాష్ట్రాల్లో 13 దేశీయ పోర్టులున్నాయి. దేశంలోని మొత్తం కార్గో ర‌వాణాలో అదానీ గ్రూపునకు 25 శాతం వాటా ఉంది. గత నెలలో గుజరాత్ ముంద్రా పోర్టులో 3 వేల కిలో డ్రగ్స్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) పట్టుకుంది. దీనికి సంబంధించి అదానీ గ్రూపుపై ఆరోపణలు పెరిగాయి. ఈ క్రమంలో అదానీ గ్రూప్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.



Next Story

Most Viewed