నీటి పొదుపు చర్యలపై ‘వాటర్ హీరో’ క్యాంపెయిన్

by Shyam |
నీటి పొదుపు చర్యలపై ‘వాటర్ హీరో’ క్యాంపెయిన్
X

దిశ, ఫీచర్స్ : టీనేజ్ అబ్బాయిలంటే.. కాలేజ్‌కు వెళ్లడం, ఫ్రెండ్స్‌‌తో అల్లరి చిల్లరగా తిరుగుతూ టైమ్ పాస్ చేయడం తప్ప వేరే వ్యాపకాలు ఉండవనుకుంటారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన కాలేజ్ స్టూడెంట్ సవన్ కనోజియా మాత్రం అలా కాదు.. 19 ఏళ్లకే పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడుతూ, నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. కొవిడ్ తర్వాత ప్రజలు ఎదుర్కోబోయే అతిపెద్ద సమస్య ‘నీటి సంక్షోభమే’నని హెచ్చరిస్తున్నాడు. నీటిని పొదుపుగా వాడుకుంటూ భావితరాలకు అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.

ప్రపంచాన్ని మార్చాలంలే ముందు మానం మారాలని, మార్పు మనతోనే మొదలవ్వాలని చెప్తున్నాడు సవన్ కనోజియా. తను 9వ తరగతి చదువుతున్నప్పుడు స్కూల్‌లో సీనియర్స్, మిత్రులు కుళాయి నీటిని వేస్ట్ చేయడాన్ని గమనించానని, నీటి సంరక్షణకు ఏదైనా చేయాలనే ఆలోచన తనకు అప్పుడే కలిగిందని తెలిపాడు. ఆ తర్వాత ‘ఎన్విరాన్‌మెంట్ క్లబ్’ పేరిట స్నేహితులందరం కలిసి ఓ గ్రూప్ ఫార్మ్ చేశామని తెలిపాడు. చెట్లను రక్షించాలనే నినాదంతో స్కూల్ టీచర్స్, ప్రిన్సిపాల్ సాయంతో అవగాహనా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు వెల్లడించాడు.

ఇక ఈ ఏడాది జనవరి 24న ‘పానీ కి బాత్’ పేరిట నీటి పొదుపు చర్యలు వివరించేందుకు తమ క్లబ్ తరఫున క్యాంపెయిన్ స్టార్ట్ చేయగా, ఇందులో భాగంగా 50 గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఈ మేరకు జలాశయాలు, కుంటలు, చెరువులు క్షీణించే పరిస్థితులతో పాటు వాటిని సంరక్షించుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే విషయాలపై అవగాహన కల్పించేందుకు ‘జల్ చౌపాల్’లను నియమించారు. పర్యావరణ సమతుల్యత, జీవ వైవిధ్యం దెబ్బతినకుండా ఉండటంలో ప్రాణాధారమైన నీటి పాత్ర ప్రతీ ఒక్కరికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా భారత ప్రభుత్వ జల మంత్రిత్వశాఖ గతేడాదికి(2020)గాను సనన్ కనోజియాను ‘వాటర్ హీరో’గా ప్రకటించడం విశేషం.

Advertisement

Next Story