‘పోడు’ రైతులకు సువర్ణావకాశం.. అస్సలు మిస్ చేసుకోవద్దు

by  |
‘పోడు’ రైతులకు సువర్ణావకాశం.. అస్సలు మిస్ చేసుకోవద్దు
X

దిశ, కొత్తగూడ : ఏజెన్సీలో పోడు భూములను ఏండ్లుగా సాగు చేసుకుంటూ జీవిస్తున్న రైతులకు ప్రభుత్వం కొత్తగా ఇచ్చే హక్కు పత్రాలతోనే శాశ్వత పరిష్కారం లభించనుందని మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం కొత్తగూడ మండలంలోని గాంధీనగర్‌లో అదనపు కలెక్టర్ పర్యటించారు. పోడు భూముల రక్షణకు ప్రభుత్వం అందిస్తున్న హక్కు పత్రాల దరఖాస్తులకై లబ్ధిదారులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ కమిటీలు దరఖాస్తులను సేకరించడమే కాకుండా పారదర్శకంగా, జవాబుదారీతనంతో పని చేస్తుందన్నారు. ఆవాసాల వారీగా దరఖాస్తులను ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అర్హత ఉన్న పోడు సాగుదార్లకు న్యాయం చేకూర్చాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. దరఖాస్తులు నింపేందుకు ఆయా గ్రామాల్లో ఉపాధ్యాయులను సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న గిరిజన రైతులు అనగా డిసెంబర్ 2005 కు ముందు వ్యవసాయం చేస్తూ, తగిన ఆధారాలను సరైన సమయంలో సమర్పించలేక హక్కు పొందలేని రైతులకు ఇది చక్కని అవకాశంగా పేర్కొన్నారు. అర్హులందరూ తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎఫ్ఆర్సీ కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. లేనిపక్షంలో మండల స్థాయి, జిల్లా స్థాయి కమిటీలు నిశితంగా పరిశీలించి చర్యలు తీసుకుంటారన్నారు. అనంతరం స్థానిక నర్సరీని సందర్శించి మొక్కల వివరాలను సర్పంచ్ రణధీర్‌ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మార్వో చందా నరేష్, ఎంపీడీవో కరణ్ సింగ్, ఏవో ఉదయ్ కుమార్, ఎంపీఓ సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి రమేష్, రవీందర్, సిద్దబోయిన రమేష్, సిరిగిరి సురేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed