అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం

by  |
అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం
X

దిశ ప్రతినిధి, హైద‌రాబాద్/శేరిలింగంపల్లి: విశ్వనగరం హైదరాబాద్.. శరవేగంగా అభివృద్ధి చెందుతూ అంతర్జాతీయ స్థాయిలో కీర్తి గడిస్తున్న నగరం. పేరుకే గొప్పలు కానీ, చినుకుపడితే చాలు భాగ్యనగర విశ్వరూపం బట్టబయలవుతుంది. చిన్నపాటి వర్షానికే కాలనీలు నీటమునిగిపోతాయి. రోడ్లు నదులను తలపిస్తాయి. పడవలు వేసుకుని తీరగాల్సిన పరిస్థితి. దీనికి కారణం నాలాల ఆక్రమణ, చెరువులు, కుంటల కబ్జా. భాగ్యనగరం చుట్టూ ఉన్న వందల కొద్ది గొలుసుకట్టు చెరువులు నేడు కనుమరుగయ్యాయి. బఫర్​జోన్ లోనే బహుళ అంతస్తుల నిర్మాణాలు వెలిశాయి. నాలాల దారిమళ్లింపు. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు’ అంతా జరిగిపోయాక అధికారులు మేల్కొన్నారు. నాలాల ఆక్రమణ, కబ్జాలపై ఉక్కుపాదం మోపేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే మాస్టర్​ప్లాన్​రూపొందించి చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు.

అంత‌ర్జాతీయ స్థాయికి హైద‌రాబాద్ న‌గ‌రాన్ని తీర్చి దిద్దేందుకు చ‌ర్యలు తీసుకుంటున్నామ‌ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రక‌ట‌న‌లు నీటి మూటలుగా మిగిలిపోతున్నాయి. పేరుకే భాగ్యనగరంగా పిలువబ‌డుతున్న హైద‌రాబాద్ కొన్నేళ్లుగా బాధల నగరంగా మారుతోంది. చినుకు పడితే చాలు చిత్తడిగా తయారవుతోంది. చిన్నపాటి వర్షాలకే రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ఇళ్లు నీట మునుగుతున్నాయి. వాహనాలు కొట్టుకుపోతున్నాయి. అసలు ఈ సమస్యకు కారణం ఏమిటి ? నాలాలు, నగరం చుట్టూ ఉన్న చెరువులు, కుంటలు ఏమయ్యాయి? చిన్నపాటి వర్షాలకు కూడా భాగ్యనగరం ఎందుకు నీటమునుగుతుంది? వీట‌న్నింటికి స‌మాధానం చెరువులు, కుంటలు కబ్జాకు గురి కావ‌డ‌మే. ఇదంతా అధికారులకు తెలిసినప్పటికీ చేష్టలుడిగి చూస్తున్నారు. రాజ‌కీయ ఒత్తిళ్లకు త‌లొగ్గుతూ ఒక‌డుగు ముందుకు వేస్తే రెండ‌డుగులు వెనక్కు తగ్గుతున్నారు. దీనికితోడు నిజాం కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థనే నేటికీ కొనసాగించడం, ప్రత్యామ్నాయ వ్యవస్థలపై దృష్టి పెట్టకపోవడంతో సమస్య తీవ్రంగా మారింది. వీట‌న్నింటిపై ఇటీవ‌ల కాలంలో వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌తో ప్రభుత్వం మేల్కొంది. కబ్జాబలపై ఉక్కుపాదం మోపేందుకు సమాయత్తం అవుతోంది. ఇందుకోసం మాస్టర్ ప్లాన్ రెఢీ చేసే పనికి అధికారులు శ్రీకారం చుట్టారు.

నగరంలో తగ్గిన చెరువులు, కుంటలు..

గతంలో హైదరాబాద్ మహానగరం, దానిచుట్టూ వందలాది చెరువులు, కుంటలు ఉండేవి. కానీ, మహానగర విస్తీర్ణం రోజురోజుకూ పెరుగుతూ కాంక్రీట్ జంగిల్ గా మారిపోయింది. దీంతో చెరువులు, కుం టలు క్రమంగా కనుమరుగవుతూ వస్తున్నాయి. ఇప్పటికే వందలాది చెరువులు, కుంటలు కబ్జాకోరల్లో చిక్కుకున్నాయి. చెరువులు, కుంటల్లో బహుళ అంతస్తలు వెలుస్తున్నాయి. ఇక నాలాల పరిస్థితి మరీ దారుణం. నాలా స్థలాలను ఆక్రమించడమే కాకుండా వాటిపైనే నిర్మాణాలు చేపట్టారు. కొన్నిచోట్ల నాలాల కు అడ్డుగా నిర్మాణాలు చేపట్టడంతో మురుగునీరు, వర్షపు నీరు వెళ్లకుండా రోడ్లపై పారుతున్నాయి. నాలాల పై అక్రమ నిర్మాణాలు సాగినా జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు చూస్తూ మి న్నకుండి పోవడంతో నగరంలో చిన్నపాటి వర్షాలకు కూడా వరద నీరు, మురుగునీరు రోడ్లపై చేరి విశ్వనగరాన్ని కాస్త బురదనగరంగా మారుస్తున్నాయి.

అధికారుల కసరత్తు ఫలిస్తుందా..

నాలాలపై నిర్మాణాలు, కబ్జాలను తొలగించేందుకు మ‌హా న‌గ‌ర పాల‌క సంస్థ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా మూడు రోజుల క్రితం జీహెచ్ఎంసీ ప‌రిధిలోని అన్ని స్వర్కిళ్ల అధికారులతో సమావేశం నిర్వహించారు. కొన్ని చోట్ల నాలాలపైనే బహుళ అంతస్తుల భవనాలు వెలిశాయి. కొన్ని చోట్ల నాలాలనే దారి మళ్లించారు. ఇలా అనేక రకాలుగా నాలాల ఆక్రమణలు జరిగాయి. వీటిని ఎలా తొలగించాలి, క్షేత్రస్థాయిలో జరిగే పరిణామాలు ఏంటి, నాలాలపై ఆక్రమణలు జరుగుతుంటే ఇన్నాళ్లు ఎందుకు ఉపేక్షించారు. ఎవరు బాధ్యులు అన్నదానిపై క్లారిటీ లేకుండానే వాటిని తొలగిస్తామంటే ఎలా ? తొల‌గింపు సాధ్యమేనా ? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

మూసీ ఆక్రమ‌ణ‌లు తొల‌గించాలి..

హైద‌రాబాద్ న‌గ‌రంలో 44 కిలో మీట‌ర్ల మేర ప్రవ‌హించే మూసీ నది ప‌రిస‌ర ప్రాంతాలు చాలా చోట్ల ఆక్రమ‌ణ‌కు గుర‌య్యాయి. వీటి వెంట బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాలు సైతం వెలిశాయి. మూసీని అనుస‌రించి ఉన్న ఇలాంటి ఆక్రమణల వివరాలను త‌ర‌చుగా ఎంఆర్‌డీసీ అధికారులు సేక‌రిస్తున్నప్ప‌టికీ వాటిని తొల‌గించ‌డం ఆచ‌ర‌ణకు నోచు కోవ‌డం లేదు. హైదరాబాద్‌ రెవెన్యూ పరిధిలో సుమారు 750, రంగారెడ్డి రెవెన్యూ పరిధిలో 300, మేడ్చల్‌ రెవెన్యూ పరిధిలో 75 వ‌ర‌కు ఆక్రమణలు ఉన్నట్లు సమాచారం. కానీ, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులు కలిసి ఆక్రమణలను గుర్తిస్తే రెట్టింపు స్థాయిలో ఉండే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. మూసీ వెంట నిర్మాణాలు చొచ్చుకొస్తుండడంతో వివిధ ప్రాంతాల్లో నది కుచించుకుపోతోంది. దీంతో భారీ వ‌ర్షాలు కురిసిన‌ప్పుడు వరదనీరు వెళ్లే దారి లేక ప‌రిస‌ర ప్రాంతాల‌ను ముంచెత్తుతోంది. ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల జ‌రిగిన స‌మావేశంలో అధికారులు వీట‌న్నింటి విష‌యంలో చ‌ర్చించిన‌ట్లు తెలిసింది. మ‌రి జీహెచ్ఎంసీ ప‌రిధిలో వెల‌సిన ఇలాంటి ఆక్రమ‌ణ‌ల‌పై అధికారులు ఎలాంటి చ‌ర్యలు తీసుకుంటారోన‌ని న‌గ‌ర ప్రజ‌లు ఎదురు చూస్తున్నారు .

ఇదీ లెక్క..

ఇటీవల కురిసిన భారీ వ‌ర్షాల‌కు ఔటర్ రింగ్ రోడ్డు లోపల 26 మున్సిపాలిటీల పరిధిలోని 315 ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. 573 నాలాలు ఆక్రమణలు జరిగాయని, 247 శిఖం స్థలాలు ఆక్రమణ గురికాగా, శిఖం భూముల్లో 4,606 కట్టడాలు వెలిసినట్లు అధికారికంగా గుర్తించారు. మామూళ్లకు అలవాటుపడిన కొందరు అధికారులు చెరువు స్థలాల్లో నిర్మాణాలు సాగుతున్నా బఫర్ జోన్ లోకి రాదంటూ, శిఖం స్థలాలు కావంటూ నిరభ్యంతర పత్రాలు జారీచేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల శేరిలింగంపల్లి నియోజకవర్గంలో చెరువు స్థలాల్లో జరుగుతున్న నిర్మాణాలను బీజేపీ నాయకులు అడ్డుకున్నా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడలేదు. అదేమంటే బఫర్ జోన్ పరిధి కాదంటూ అప్పటికే నిరభ్యంతర పత్రం జారీ చేశారు. ఓ అధికార పార్టీ నేత కీ రోల్ పోషించినట్లు సమాచారం.


Next Story

Most Viewed