అంగారకుడిపై తొలి హెలికాప్టర్.. మార్స్ వీధుల్లో ‘ఇన్‌జెన్యూటీ’ విహారం

by  |
అంగారకుడిపై తొలి హెలికాప్టర్.. మార్స్ వీధుల్లో ‘ఇన్‌జెన్యూటీ’ విహారం
X

దిశ, ఫీచర్స్: అంగారకుడిపై జీవాన్వేషణకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ 2020లో పర్సెవరెన్స్ రోవర్‌ను పంపగా, అది ఫిబ్రవరి 18న అంగారకుడిపై సక్సెస్ ఫుల్‌గా ల్యాండ్‌ అయిన సంగతి తెలిసిందే. ఆ రోవర్‌ నుంచి ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్‌ను నాసా ఇటీవల అంగారకుడి ఉపరితలంపైకి ప్రవేశపెట్టగా, ఆదివారం అది మార్స్ వీధుల్లో ఎగరనుంది. నాసా వెల్లడించిన సమయం ప్రకారం మార్స్‌పై డేటా రికార్డై పూర్తిగా భూమికి చేరే సరికి సోమవారం మధ్యాహ్నం రెండు గంటలు (ఇండియాలో) అవుతుందని అంచనా వేశారు. ఇప్పటికే హెలికాప్టర్‌ రోటర్లను నాసా పరీక్షించగా, చిన్న సమస్య వల్ల ఏప్రిల్ 14 వరకు దీన్ని డిలే చేశారు. అయితే ఈ హెలికాప్టర్​ సాయంతో మార్స్ ఉపరితలంపైన ఉండే పరిస్థితుల గురించి ముఖ్యసమాచారాన్ని పొందొచ్చని నాసా భావిస్తోంది. భూమ్మీద కాకుండా మరో గ్రహంపై హెలికాప్టర్‌ను వినియోగించనుండటం ఇదే తొలిసారి. ఈ బుల్లి హెలీకాప్టర్‌ విశేషాలు మీ కోసం..

భూమితో పోలిస్తే అంగారకుడిపై గురుత్వాకర్షణ శక్తి తక్కువ. అందుకే రెడ్ ప్లానెట్‌పై ల్యాండింగ్‌తో పాటు పైకెగరడం కూడా కాస్త కష్టతరమైన విషయం. అయినా ఎలాంటి సాంకేతిక సాయం లేకుండానే హెలికాప్టర్‌ అక్కడి వాతావరణానికి తట్టుకోగలుగుతోందని, గాల్లో చక్కర్లు కొడుతుందని నాసా వెల్లడించింది. ఈ మినీ హెలికాప్టర్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన రెండు రోటర్లు, వాటికి అమర్చిన రెండు జతల కార్బన్‌ ఫైబర్‌ బ్లేడ్లతో గాల్లోకి ఎగురుతుంది. ఇవి 2,400 ఆర్‌పిఎమ్ వద్ద వ్యతిరేక దిశల్లో తిరుగుతాయి. ఈ లెక్కన కుజుడి గగనవీధుల్లో తిరిగే సాధారణ హెలికాప్టర్ కంటే చాలా రెట్లు వేగంగా తిరుగుందన్నమాట. ఇది వినూత్న సోలార్ సెల్స్, బ్యాటరీలు ఇతర భాగాలతో పాటు మార్స్ ఉపరితలాన్ని పరీక్షించేందుకు ప్రత్యేకమైన కెమెరాలు, లేజర్ పరికరాలను కలిగి ఉంది.

2014 నుంచి 2019 వరకు జెపిఎల్‌(జెట్ ప్రపోల్షన్ ల్యాబోరేటరీ)‌కు చెందిన ఇంజినీర్లు ‘మార్స్’ వాతావరణంలో ప్రయాణించే విమానం కోసం శ్రమించారు. అంగారక గ్రహ వాతావరణాన్ని తట్టుకునే సామర్థ్యాన్ని, అక్కడ ఎగిరే విమానాన్ని నిర్మించడం సాధ్యమని నిరూపించారు. జెపిఎల్‌లోని స్పెషల్ స్పేస్ సిమ్యులేటర్లలో క్రమంగా మరింత ఆధునిక మోడళ్లను పరీక్షించారు. ఈ క్రమంలో జనవరి 2019లో రెడ్ ప్లానెట్‌పై అడుగుపెట్టే ఫైనల్ హెలికాప్టర్ ‘ఇన్‌జెన్యూటీ’ అమోదం పొందింది. ఈ హెలీకాప్టర్ అరుణగ్రహంపై విహరించకముందే కొన్ని అడ్డంకులను విజయవంతంగా దాటింది. కేప్ కెనావెరల్ నుంచి మార్స్ వరకు ప్రయాణించడం, పర్సెవెరన్స్ నుంచి ఉపరితలంపై ల్యాండ్ కావడం, అక్కడి వాతావరణానికి అనుకూలంగా ఆటో‌మేటిక్‌గా వెచ్చగా ఉంచుకోవడం, చార్జ్ చేసుకోవడం అన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. ఇక అది మార్స్ ఉపరితలం మీద విహరించి, అక్కడి పరిస్థితులను పరీక్షిస్తే పూర్తి విజయం సాధించినట్లే. అది జరిగితే వీలైనంత త్వరగా మరో నాలుగు టెస్టింగ్ హెలికాప్టర్స్‌ను ప్రయత్నించేందుకు ఇన్‌జెన్యూటీ బృందం సిద్ధంగా ఉంది.

మార్స్‌ ఉపరితలంపై పది అడుగుల ఎత్తులో ఇన్‌జెన్యుటీ ప్రయాణించనుండగా, ఆ సమయంలో 90 సెకన్ల పాటు తిరుగుతూ ఫొటోలు తీస్తుంది. మార్స్ వాతావరణం భూమి కంటే 99% తక్కువ సాంద్రతతో ఉన్నందున విమానాన్ని చాలా తేలికగా ఉండేలా తయారుచేశారు. దీని బరువు 1.8 కిలోలు మాత్రమే.

రోటర్ బ్లేడ్లు చాలా పెద్దవిగా తయారు చేయడం వల్ల అవి వేగంగా తిరుగుతాయి. మార్స్‌లోని జెజెరో క్రేటర్ బిలం వద్ద ఎముకలు కొరికే చలి ఉంటుంది. అక్కడ రాత్రివేళల్లో మైనస్ 130 డిగ్రీల ఫారెన్‌హీట్ (మైనస్ 90 డిగ్రీల సెల్సియస్) ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ టెంపరేచర్ తట్టుకునేందుకు తనను తాను వెచ్చగా ఉంచుకోవడంతో పాటు ఒక వే పాయింట్ నుంచి మరో వే పాయింట్‌కి ఎలా ప్రయాణించాలో కూడా దానికదే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఇన్‌జెన్యూటీకి ఉంది. ఇక మినీ హెలికాప్టర్‌ నుంచి డేటా పర్సెవరెన్స్‌ రోవర్‌కు, దాన్నుంచి ఆర్బిటర్‌కు డేటా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సదరు ఆర్బిటార్ ద్వారా నాసా డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌కు డేటా ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది.

నాసా నిర్వహించిన ‘నేమ్‌ ద రోవర్‌’ పోటీకి వచ్చిన 28 వేల ఎంట్రీల నుంచి ఈ మినీ హెలీకాప్టర్‌కు ‘ఇన్‌జెన్యూటీ’ అనే పేరును ఫైనల్‌ చేశారు. అలబామాలోని నార్త్‌పోర్ట్‌కు చెందిన హైస్కూల్ విద్యార్థి, భారత సంతతి అమ్మాయి వనీజా రూపానీ ‘ఇన్‌జెన్యూటీ’ అనే పేరును సూచించడం విశేషం. ‘ఇంటర్ ప్లానెటరీ ట్రావెల్ (అంతర గ్రహ ప్రయాణ) సవాళ్లను అధిగమించడానికి కష్టపడి పనిచేసే శాస్త్రవేత్తల ఇన్‌జెన్యూటీ(చాతుర్యం), మేధస్సు మనందరినీ అంతరిక్ష పరిశోధన అద్భుతాలను అనుభవించడానికి వీలు కల్పిస్తాయి. వారి పట్టుదల, శ్రమకు గుర్తింపుగా ఇది నిలుస్తుంది’ అని రూపానీ తెలిపింది. ఇన్‌జెన్యూటీ అనేది క్వాలిటీ ఆఫ్ క్లెవర్, ఇన్నోవేటివ్‌‌ను సూచిస్తుంది.

ప్రస్తుతం మార్స్‌పై ల్యాండ్ అయిన అధిక ఓవర్ హెడ్ ఆర్బిటార్స్, రోవర్లు లేదా ల్యాండర్లు అందించని ప్రత్యేకమైన దృక్పథాన్ని ఈ విమానాలు అందించగలవు. హై-డెఫినిషన్ చిత్రాలు అందించడంతో పాటు రోవర్లు చేరుకోలేని కష్టతరమైన భూభాగాలకు కూడా ఇవి ప్రయాణించి అక్కడి డేటాను అందించగలవు. అంతేకాదు మార్షియన్ వాతావరణంలో ఇన్‌జెన్యూటీ విజయవంతమైతే, ఈ సాంకేతికత సహాకారంతో అధునాతన రోబోటిక్ ఎగిరే వాహనాలు రూపొందించి.. మరిన్ని హ్యుమన్, రోబోటిక్ మిషన్స్ మార్స్ మీదకు ప్రయోగించొచ్చని నాసా భావిస్తోంది. ఈ క్రమంలో భవిష్యత్తులో పూర్తిస్థాయిలో మార్స్‌పై గాల్లో ఎగురుతూ పరిశీలించే హెలికాప్టర్‌ను పంపేందుకు నాసా సయయాత్తమవుతోంది.


Next Story

Most Viewed