‘ప్లీజ్ నాన్న..! బయటకు రా.. వీళ్లు నిన్ను ఏం చేయరు’ కన్నీరు పెట్టిస్తున్న ఉగ్రవాది కొడుకు వీడియో

by  |
heart-wrenching video
X

దిశ, వెబ్‌డెస్క్: ‘నాన్న.. నేను మీ కొడుకును. బయటకు రండి నాన్న. నాకు మిమ్మల్ని చూడాలని ఉంది. మీరు నాకు చాలా గుర్తొస్తున్నారు. ఈ పోలీసులు మిమ్మల్ని ఏం అనరు..’ తండ్రి కోసం ఓ నాలుగేళ్ల బాలుడు పడుతున్న ఆవేదన ఇది. ఉగ్రవాదిగా మారిన సదరు తండ్రిని లొంగిపోవాలని, పోలీసులు అతడిని ఏం చేయరని చెబుతూ ఆ చిన్నారి ప్రార్థించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

జమ్మూకాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో సోమవారం ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరగగా ఈ ఘటనలో నలుగురు ముష్కరులు మట్టికరిచారు. అందులో అఖిబ్ అహ్మద్ మాలిక్ ఒకడు. అయితే కాల్పులకు ముందు ఉగ్రవాదులు లొంగిపోవాలని వారి కుటుంబసభ్యులతో అధికారులు విజ్ఞప్తి చేయించారు.

ఈ సందర్భంగా అఖిబ్ అహ్మద్ భార్య ఆయనను లొంగిపోవాలని కోరారు. ‘మన ఇద్దరు చిన్నారులు నాతో ఉన్నారు. బయటకు వచ్చి లొంగిపోండి. ఒకవేళ నువ్ లొంగిపోకుంటే నన్ను కాల్చి చంపేయ్..’ అంటూ కన్నీటి పర్యంతమైంది. ఆ తర్వాత పక్కనే ఉన్న అఖిబ్ కొడుకు మైక్ తీసుకుని.. ‘అబ్బూజీ.. నేను అబ్రర్‌ను. మీరు లొంగిపోండి. నాకు మిమ్మల్ని చూడాలని ఉంది. వీళ్లు (భద్రతా బలగాలు) మిమ్మల్ని ఏం చేయరు..’ అంటూ రోదించాడు. ఆ బాలుడు అంత ఆవేదన చెందినా అతడి విన్నపాన్ని మాత్రం ఆ తండ్రి తీర్చలేదు. అఖిబ్ లొంగిపోలేదు.

25 ఏళ్ల అఖిబ్.. బ్యాంకులో ఉద్యోగిగా పనిచేసేవాడు. మూడు నెలల క్రితం కనిపించకుండా పోయిన అతడు.. ఉగ్రవాదులతో చేతులు కలిపాడు. సోమవారం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు జరిగిన కాల్పుల ఘటనలో అఖిబ్ హతమయ్యాడు. కాగా, ఈ హృదయ విదారక వీడియోను చూసిన నెటిజన్లు.. ‘గుండె పగిలినంత పనైంది’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.



Next Story

Most Viewed