కేజ్రీవాల్‌.. అ‘సామాన్యుడు’

by  |
కేజ్రీవాల్‌.. అ‘సామాన్యుడు’
X

సామాన్యుడేం చేయగలడు?
గల్లీని మార్చగలడు
ఢిల్లీని ఏలగలడు
ఏమార్చే ఆధిపత్యశక్తులకు
మూర్చ తెప్పించగలడు

ఈ కవిత్వపాదాలు అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రతిబింబంగా నిలుస్తాయి. ఆయన సామాన్యుల్లో అసామాన్యడు, అసామాన్యుల్లో సామాన్యడు. ప్రభుత్వ అధికారిగా జీవనయానం కొనసాగించి ఇప్పుడు మూడోసారి ఢిల్లీ సీఎం అయ్యారు. చదువు, ఉద్యోగం, ప్రభుత్వ కొలువు, తర్వాత సమాజ శ్రేయస్సు వైపునకు అడుగులేసి అసాధారణ ప్రయాణాన్ని సాగించాడు. అవినీతి వ్యతిరేక ఉద్యమంతో అసామాన్యుడిగా ఎదిగాడు. ఎన్జీవో సంస్థలు నడిపి ప్రజల పక్షాన నిలిచాడు. రామన్ మెగసెసే అవార్డు పొంది ఒక్కసారిగా విశేష ప్రచారాన్ని సంపాదించుకున్నాడు. ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే నాయకత్వంలోని అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాలుపంచుకున్నాడు. సమాజాన్ని సమూలంగా మార్చాలంటే ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి దిగడం తప్పనిసరి అని ప్రకటించి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి వరకున్న రాజకీయ లెక్కలను తారుమారు చేశారు. ఒక కొత్త ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచారు.

తలపై తెల్లని టోపీ, మెడ చుట్టూ మఫ్లర్, కాళ్లకు స్లిప్పర్లు, లూజు దుస్తులతో ఏ విషయమైనా సరళంగా మాట్లాడుతూ మధ్య, మధ్యలో హాస్యాన్ని జోడించే అరవింద్ కేజ్రీవాల్ కామన్ మ్యాన్‌ అవతారానికి నిలువెత్తు రూపంలా ఉంటారు. అంతే తెలివిగా ఎంచుకున్న పార్టీ పేరు ఆమ్ ఆద్మీ(సామాన్యుడు), పార్టీ గుర్తు (చీపురు)తో ప్రజలతో సులువుగా కనెక్ట్ అయ్యారు. ఆప్ స్థాపించిన కాలంలో కాంగ్రెస్ స్కామ్‌లతో ప్రజలు విసుగెత్తిపోయి ఉన్నారు. అందుకే నాయక్(ఒకే ఒక్కడు) సినిమాలో హీరోలా సామాన్యుడే సరైన పాలన అందించగలడన్న విశ్వాసం బలపడుతున్న కాలం అది. అటువంటి సమయంలో ప్రజల్లో తిరుగుతూ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సామాన్యుడు కేజ్రీవాల్‌పై ఢిల్లీ ప్రజలకు నమ్మకం కలిగింది. అవినీతిని రూపుమాపితేనే ప్రగతి సాధ్యమని చెప్పే కేజ్రీవాల్‌కు పట్టంకట్టి ఢిల్లీ పీఠాన్ని అప్పగించారు. అందుకే బడా నేతలు కాదు.. వంశపాలకులూ వద్దని సామాన్యుడికే ఢిల్లీ పాలనాపగ్గాలు అప్పగించారు. ఆ అ‘సామాన్యుడి’ గురించి కొన్ని సామాన్య ముచ్చట్లు ఇవి..

హర్యానాలోని భివాని జిల్లాలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ గొబిన్ రామ్ కేజ్రీవాల్, గీతాదేవీ దంపతులకు 1968 ఆగస్టు 16న జన్మించారు. ఉద్యోగి ఇంట పుట్టిన అరవింద్ కేజ్రీవాల్ తన కెరీర్‌నూ ఉద్యోగంతోనే మొదలుపెట్టాడు. ఇప్పటికీ నిరాడంబర జీవితాన్ని ఇష్టపడతాడు. తన ఐఆర్ఎస్ బ్యాచ్‌మేట్ సునీతను ప్రేమించాడు. ప్రపోజ్ చేసి పెళ్లికి ఒప్పించారు. 1994లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కొడుకు, కూతురు సంతానం. తల్లిదండ్రులూ అరవింద్ కేజ్రీవాల్‌తోనే ఉంటారు.

ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెకానికల్ ఇంజనీర్ చదివిన అరవింద్ కేజ్రీవాల్.. 1989లో టాటా స్టీల్‌లో చేరాడు. మూడేళ్ల తర్వాత రాజీనామా చేసి యూపీఎస్‌సీ ప్రిపేరై ఇండియన్ రెవెన్యూ ఆఫీసర్‌(1995)గా ఎంపికయ్యారు. ఉద్యోగం చేస్తూనే సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకునేవారు. కోల్‌కతాకు చెందిన మదర్ థెరిస్సా మిషనరీలతోనూ కలిసిపనిచేశారు. 1999లోనే పరివర్తన్ అనే ఎన్జీవోను స్థాపించి రేషన్ సరుకులు, విద్యుత్, సంక్షేమ పథకాలుసహా ఇతర సమస్యల పరిష్కారానికి పూనుకుని మురికివాడల ప్రజలకు చేరువయ్యారు. సామాన్యుల ఆయుధం ఆర్టీఐ యాక్ట్ కోసం ఉద్యమించారు. పరివర్తన్ ద్వారా ఆర్టీఐలు దాఖలు చేసి సమస్యలను తీర్చేందుకు నడుంకట్టారు.

పేదల సాధికారత కోసం పోరాడినందుకు ఎమర్జెంట్ లీడర్షిప్ రామన్ మెగసెసే అవార్డును 2006లో పొందారు. 2005లో అన్నా హజారే నేతృత్వంలో ఉధృతమైన అవినీతి వ్యతిరేక పోరాటం.. జన్‌ లోక్‌పాల్ ఉద్యమంలోనూ కేజ్రీవాల్ పాల్గొన్నాడు. 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. 48 రోజుల తర్వాత రాజీనామా చేయగా 2015లో మళ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రికార్డుస్థాయిలో 70 సీట్లకుగాను 67 స్థానాలను ఆప్ కైవసం చేసుకుంది. తాజాగా, 2020లోనూ 62 సీట్లను సాధించి తన ఉనికి దృఢంగా ఉన్నదని కేజ్రీవాల్ నిరూపించుకున్నారు. సామాన్యుడు గల్లీని మార్చగలడు.. ఢిల్లీని ఏలగలడు అని నిరూపించారు.

Next Story

Most Viewed