మారుమూల గ్రామ యువకుడి ట్వీట్.. బస్ ఏర్పాటు చేసిన సజ్జనార్

by  |
Sajjanar
X

దిశ,బోథ్ : మారుమూల గ్రామానికి చెందిన యువకుడు చేసిన ట్వీట్‌కు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని వెంటనే బస్ సౌకర్యాన్ని కల్పించారు. ఇంతకూ ట్వీట్ ఎవరు చేశారు..? ఏమని చేశారో తెలుసుకుందాం రండి..

హైదరాబాద్ నుంచి బోథ్ మీదుగా సోనాల వరకు గతంలో బస్ సౌకర్యం ఉండేదని, ప్రస్తుతం ఆ సర్వీస్ బంద్ కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని బోథ్ మండల కేంద్రానికి చెందిన బోనగిరి కిరణ్ కుమార్ అనే యువకుడు గురువారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ట్వీట్ చేశారు. ట్వీట్‌కు 24 గంటల్లోనే సజ్జనార్ స్పందించారు. శుక్రవారం ఉదయం సజ్జనార్ పీఏ కిరణ్‌కు ఫోన్ చేసి బస్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఆ తర్వాత కిరణ్‌ కుమార్‌కు నిర్మల్ డీఎం ఆంజనేయులు ఫోన్ చేశారు. గతంలో హైదరాబాద్ నుంచి బోథ్ మీదుగా సోనాలకు నడిపిన బస్ సర్వీస్‌లకు నష్టాలు వచ్చాయని, అందుకే ఆ రూట్లో బస్ బంద్ అయిందని వివరించారు. ప్రస్తుతం బోథ్, సోనాల ప్రయాణీకుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి వచ్చే వారి కోసం ఉదయం 5 గంటలకు ఎక్స్ ప్రెస్ బస్‌ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ బస్ దీపావళి నుండి ప్రారంభిస్తామని డీఎం ఆంజనేయులు.. కిరణ్‌ కుమార్‌కు హామీ ఇచ్చారు. కాగా ట్వీట్ చేసిన యువకుడు బోనగిరి కిరణ్ కుమార్,ఆర్టీసీ ఎండీ సజ్జనార్, నిర్మల్ డీఎం అంజనేయులకు ఆ ప్రాంత ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.

Next Story

Most Viewed