బస్సు కింద పడి మూడేళ్ల బాలుడు మృతి

by  |
బస్సు కింద పడి మూడేళ్ల బాలుడు మృతి
X

దిశ, క్రైమ్ బ్యూరో : ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్ ఎంజీబీఎస్‌లో చోటు చేసుకుంది. ఎస్ఐ అనిల్ తెలిపిన వివరాల ప్రకారం…హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని నౌ నెంబరు నగర్‌కు చెందిన ఖలీల్, ఉజ్మాబేగంలు భార్యాభర్తలు. ఉజ్మా బేగం సొంతూరు నిజామాబాద్ వెళ్లి ఆదివారం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైంది. నిజామాబాద్‌లో టీఎస్ 16జడ్ 0127 నెంబరు గల గరుడ బస్సు‌ను హైదరాబాద్ వచ్చే నిమిత్తం ఎక్కింది. నగరంలోని ఎంజీబీఎస్‌కు బస్సు ఆదివారం మధ్యాహ్నం చేరుకుంది.

బస్సును ఫ్లాట్ ఫాం వద్ద ఆపకుండా, బస్టాండ్ ఆవరణలో సాధారణ ప్రదేశంలో డ్రైవర్ నిలిపాడు. ఉజ్మా బేగం చంకలో పసిబిడ్డతో పాటు తన మూడేళ్ల కుమారుడు అహాన్‌తో బస్సు దిగింది. ఆమె వెంట ఆమె సోదరుడు లగేజి పట్టుకుని వస్తున్నారు. ఇంతలో బాబు బస్సు ముందుకు వెళ్లాడు. అదే సమయంలో డ్రైవర్ నిర్లక్ష్యంగా చూసుకోకుండా అహన్ పై నుంచి బస్సు నడిపాడు. ఈ సమయంలో బాబును చూసిన వాళ్లు అరుస్తుండగానే బస్సు టైర్ అహన్ పై నుంచి వెళ్లింది. దీంతో మూడేళ్ల బాలుడు అక్కడికక్కడే మరణించాడు. బాలుడి మరణంతో తల్లి కన్నీరు మున్నీరు అయ్యింది. సమాచారం అందుకున్న అఫ్జల్ ఘంజ్ పోలీసులు బస్సు డ్రైవర్ అజిత్ సింగ్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed