నీట్ ప్రశ్నాప‌త్రం మార్పిడి.. ఆర్డీవో ఏమన్నారంటే..?

by Disha Web Desk 4 |
నీట్ ప్రశ్నాప‌త్రం మార్పిడి.. ఆర్డీవో ఏమన్నారంటే..?
X

దిశ‌, ఆసిఫాబాద్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నీట్ ప‌రీక్షలో ఒక పేప‌ర్‌కు బదులు మ‌రో పేప‌ర్ ఇవ్వడంతో గంద‌ర‌గోళ ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఎన్‌టిఏ అందించిన పేపర్ ఒకటైతే ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో అందించిన పేపర్ మారడంతో విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు ఆందోళ‌న వ్యక్తం చేశారు. వాస్తవానికి నీట్ ప‌రీక్షల‌కు సంబంధించి బ్యాంకుల‌కు ఈ ప్రశ్నాప‌త్రాలు వ‌స్తాయి. అయితే, ఆసిఫాబాద్‌లో ఎస్‌బీఐ, కెన‌రా బ్యాంకుల‌కు ఈ ప్రశ్నాప‌త్రాలు రాగా, సెంట‌ర్ చీఫ్ కో ఆర్డినేట‌ర్ ఒక ప్రశ్నాప‌త్రం బ‌దులు మ‌రో ప్రశ్నాప‌త్రం ఇచ్చారు. ఇంటికి వెళ్లి మిగ‌తా విద్యార్థుల‌తో మాట్లాడంతో వేరే ప్రశ్నాప‌త్రానికి తాము ప‌రీక్షలు రాసిన‌ట్లు తెలియ‌డంతో విద్యార్థులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు.

ఈ నేప‌థ్యంలోనే దీనిపై విచార‌ణ చేసిన ఆర్డీవో లోకేశ్వర్ ఒక పేప‌ర్ బ‌దులు మ‌రొక పేప‌ర్ ఇచ్చింది నిజ‌మేన‌ని తేల్చారు. రెండు బ్యాంకుల‌కు వెళ్లి ప్రశ్నాప‌త్రాలు తెచ్చిన సెంట‌ర్ చీఫ్ కో ఆర్డినేట‌ర్ ఒక ప్రశ్నాప‌త్రం బ‌దులు మ‌రోటి ఇచ్చార‌ని చెప్పారు. తాను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారుల‌తో మాట్లాడిన‌ట్లు వెల్లడించారు. రెండు పేప‌ర్లలో ఏ పేప‌ర్‌కు సంబంధించిన ప‌రీక్ష రాసినా దానిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటామ‌ని చెప్పార‌ని తెలిపారు. దేశంలోని ట్యూటికోరింగ్‌తో పాటు ప‌లు చోట్ల ఇలాంటి త‌ప్పిదాలు జ‌రిగిన‌ట్లు చెప్పారు. పిల్లలు, వారి త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో నీట్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయగా ఈ పరీక్షా కేంద్రంలో 323 మంది విద్యార్థులకు గాను 299 మంది విద్యార్థులు హాజరై ప‌రీక్ష రాశారు.

Next Story

Most Viewed