ఎంటర్‘ప్రైజెస్’ పేరిట…

by  |
ఎంటర్‘ప్రైజెస్’ పేరిట…
X

దిశ, ఆదిలాబాద్: ముందుగా వాళ్లు వీళ్లను తమ మాటలతో ఆకాశంలో తిప్పేశారు. దీంతో వీళ్లు వాళ్లకు డబ్బులు అప్పజెప్పారు. ఆ తర్వాత మెల్లగా అప్పుడప్పుడు ఓపెన్ చేశారు. దీంతో ఇంకొన్ని డబ్బులప్పజెప్పారు. ఆ తర్వాత ఇంకొద్ది సమయం గడిచింది కానీ, అలాంటివేమీ ఇవ్వలేదు. అయినా వీళ్లు ఓపిక పట్టారు. అయినా అదే తీరు కొనసాగింది. దీంతో వీళ్లంతా కలిసి అక్కడికెళ్లారు.. అప్పుడు తెలిసింది అసలు విషయం. అదేంటో ప్రత్యేక స్టోరీలో..

ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఓ సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడా దాడులు నిర్వహిస్తున్నారు. దీంతో మెల్లమెల్లగా ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. చాటుమాటున ఇంకా ఇలాంటివి ఎన్ని ఉన్నాయోనని పోలీసులు దాడులు ముమ్మరం చేశారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బైక్లాటరీ పేరుతో వందలాది మంది దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి ఓ ఎంటర్‌ప్రైజెస్ బోర్డు తిప్పేసింది. కొంతకాలంగా ఈ వ్యవహారం నడుపుతున్నప్పటికీ ఇందులో కొన్ని పెద్ద తలకాయలు ఉన్నకారణంగా ఎవరూ పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ కేంద్రంగా ఒక ఎంటర్‌ప్రైజెస్ సుమారు 2 వేల మందితో మోటార్ బైక్ ఇతర విలువైన వస్తువుల లాటరీ పేరుతో స్కీంను ప్రారంభించింది. ఒక్కొక్క సభ్యుడు నెలకు రూ.1,350 చొప్పున 15 నెలలపాటు డబ్బులు చెల్లించాల్సి ఉంటది. ఇందులో సభ్యులుగా ఉన్నవారికి ప్రతినెలా ఒక మోటార్ సైకిల్ లేదా ఎల్ఈడీ టీవీ ఇతర వస్తువులను లక్కీ డ్రా సభ్యుడిగా ఎంపిక చేస్తామని ఆశ చూపారు. దీంతో వందలాది మంది ప్రజలు ఈ స్కీంలో సభ్యులుగా చేరారు. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందినవారు అధిక సంఖ్యలో ఉన్నారు. పది నెలలకుపైగా ప్రతి నెలా సభ్యుల నుండి డబ్బులు వసూలు చేసిన ఎంటర్‌ప్రైజెస్ తాజాగా బోర్డు తిప్పేసింది. కోట్లాది రూపాయలు వసూలు చేసిన స్కీం నిర్వాహకులు ఇప్పుడు ముఖం చాటేశారు. దీంతో వారు.. స్కీం నడిపిన ఎంటర్‌ప్రైజెస్ ఆఫీసు వద్దకు వెళ్లి చూశారు. అక్కడ తాళం వేసి ఉండడంతో మోసపోయామంటూ బాధితులు లబోదిబోమని మొత్తుకుంటున్నారు.

పెద్ద తలకాయలు!

బోథ్ కేంద్రంగా జరిగిన ఈ స్కీం నిర్వాహణ వెనుక కొన్ని పెద్ద తలకాయలున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక రాజకీయ నాయకునితోపాటు ఆ ప్రాంతంలో పట్టున్న కొందరు పెద్ద మనుషులు, అలాగే ఇద్దరు సీనియర్ విలేకరులు కూడా ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కొక్కరి నుంచి ఇప్పటికే కనీసం రూ.15 వేల వరకు వసూలు చేసిన నిర్వాహకులు ఇప్పటి వరకు కేవలం 10 మంది సభ్యులకు మాత్రమే మోటార్ సైకిల్, మరో వందమంది సభ్యులకు ఇతర బహుమతులు ఇచ్చినట్లు సభ్యులు చెబుతున్నారు. ఇక మిగిలిన వందలాదిమంది సభ్యులకు ఏమీ ఇవ్వలేదు.. కనీసం కట్టిన డబ్బులు కూడా ఇవ్వకపోవడంతో బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. ఎంటర్ ప్రైజెస్‌కు 15 రోజులుగా తాళం వేసి ఉండటంతో నిర్వాహకులు సభ్యులను మోసం చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ఐదుగురిపై కేసు నమోదు చేయగా మరికొందరిపై కూడా నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

మరో దొంగచాటు దందా…

ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ కేంద్రంగా ఒక ఎంటర్‌ప్రైజెస్ వందలాది మందిని మోసం చేసి బోర్డు తిప్పేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన సమాచారంతో ఇదే ప్రాంతానికి చెందిన మరొక ఎంటర్ ప్రైజెస్ లక్కీ స్కీం దొంగచాటుగా నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే బోథ్ ప్రాంతంతోపాటు బజార్ హత్నూర్ ప్రాంతానికి చెందిన కొందరి సభ్యులుగా చేర్చుకున్న ఈ స్కీం నిర్వాహకులు లాటరీ నిర్వాహణను ఎప్పటి మాదిరిగా వారి ప్రాంతంలో కాకుండా రహస్య స్థావరంలో నిర్వహిస్తుండడం గమనార్హం. తాజాగా బుధవారం నిర్మల్ సమీపంలోని మహబూబ్ ఘాట్ దగ్గర ఉన్న ఓ ప్రార్థనామందిరం వద్ద ఈ లక్కీ లాటరీ నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న నిర్మల్ పోలీసులు.. సీఐ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం దాడులు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా లాటరీ నిర్వహిస్తూ ప్రజలను మోసగిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. అనంతరం వారి వద్ద నుంచి స్కీం నిర్వహణకు సంబంధించిన పుస్తకాలు, రసీదు బుక్కులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపుతున్నది.

Tags: adilabad, lucky draw, police, arrest

Next Story

Most Viewed