చెన్నయ్ సౌత్ బరిలో తమిళిసై.. బీజేపీ మూడో జాబితా విడుదల

by Dishanational5 |
చెన్నయ్ సౌత్ బరిలో తమిళిసై.. బీజేపీ మూడో జాబితా విడుదల
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ మూడో జాబితాను గురువారం విడుదల చేసింది. మొత్తం 9మంది పేర్లను ఈ జాబితాలో వెల్లడించగా, వారంతా తమిళనాడు అభ్యర్థులే కావడం గమనార్హం. తొలి దశ ఎన్నికల్లో భాగంగా వచ్చే నెల 19న తమిళనాడులోని మొత్తం 39 స్థానాలకూ అదే రోజు పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మూడో జాబితాలో తమిళనాడు అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు అధిష్టానం చెన్నయ్ సౌత్ టికెట్‌ను కేటాయించింది. రాష్ట్ర బీజేపీ చీఫ్ కే అన్నామలైని కోయంబత్తూరు నుంచి బరిలో నిలిపింది. వీరితోపాటు వినోజ్ పి సెల్వం చెన్నయ్ సెంట్రల్ నుంచి పోటీ చేస్తుండగా, వెల్లూరు నుంచి ఏసీ షణ్ముగం, క్రిష్ణగిరి నుంచి సి నరసింహన్, నీలగిరీస్(ఎస్సీ) నుంచి ఎల్ మురుగన్, పెరంబలూరు నుంచి టీఆర్ పరివేంధర్, తూత్తుకూడి నుంచి నైనర్ నాగేంద్రన్, కన్యాకుమారి నుంచి పన్ రాధాక్రిష్ణన్‌ పోటీ చేయనున్నారు. తమిళనాడులో చిన్న పార్టీలతో పొట్టుపెట్టుకున్న బీజేపీ.. మొత్తం 39 స్థానాలకుగానూ 20 సీట్లలో పోటీ చేయనుంది. మిగతా 19 సీట్లను మిత్రపక్షాలకు కేటాయించింది. ‘పత్తాలి మక్కల్ కచ్చి’(పీఎంకే) పార్టీకి 10 సీట్లు ఇవ్వగా, 3 స్థానాలు తమిల్ మానిలా కాంగ్రెస్‌కు, రెండు సీట్లు ‘అమ్మా మక్కల్ మున్నెట్ర కజగం’(ఏఎంఎంకే), ఐజేకే, ఎన్జేపీ పార్టీలకు ఒక్కో స్థానం కేటాయించింది. బీజేపీ మరో 10 స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాగా, 2019 ఎన్నికల్లో బీజేపీ తమిళనాడులో ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయిన విషయం తెలిసిందే. మరోవైపు, మొత్తం 543 స్థానాలకుగానూ బీజేపీ ఇప్పటివరకు 276 మంది అభ్యర్థులను ప్రకటించింది. 195 మందితో తొలి జాబితా విడుదల చేయగా, 72 మందితో రెండో జాబితా, తాజాగా 9 మందితో మూడో జాబితా విడుదల చేసింది.

16 మందితో ఏఐఏడీఎంకే తుది జాబితా

తమిళనాడులో ప్రతిపక్ష ఏఐఏడీఎంకే సైతం గురువారం తమ లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించింది. అంతకుముందు 16మంది అభ్యర్థులను ప్రకటించిన ఈ పార్టీ.. తాజాగా మరో 16 మందితో తుది జాబితాను విడుదల చేసింది. ఏఐఏడీఎంకే 32 స్థానాల్లో పోటీ చేస్తుండగా, మిగతా ఏడింటిని మిత్రపక్షాలైన డీఎండీకే, పుథియా తమిఝగం, ఎస్డీపీఐ పార్టీలకు కేటాయించింది.

Next Story

Most Viewed