‘BRS, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీజేపీలోకి రేవంత్ రెడ్డి జంప్’

by Disha Web Desk 2 |
‘BRS, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీజేపీలోకి రేవంత్ రెడ్డి జంప్’
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. బుధవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులు అబద్ధాలతో కాలం గడిపిందని విమర్శించారు. పదేళ్ల నిజానికి, వంద రోజుల అబద్ధానికి పార్లమెంట్ ఎన్నికల్లో యుద్ధం జరుగబోతోందని అన్నారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ప్రభుత్వం విసుగు చెందిన ప్రజలు.. పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. లంకె బిందలమీద ఉన్న సోయి.. పరిపాలన మీద లేదని ఎద్దేవా చేశారు. లంకె బిందెలు తర్వాత.. ముందు హైదరాబాద్‌లో దర్శనమిస్తున్న ఖాళీ బిందెల పరిస్థితి చూడు అని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సూచించారు.


రేవంత్ రెడ్డి ఎప్పటికీ కాంగ్రెస్ మనిషి కాదని.. బీజేపీలో చేరడమే తన అంతిమ లక్ష్యమని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే కొంతమంది బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీజేపీలోకి జంప్ అవుతారని సంచలన ఆరోపణలు చేశారు. పదేళ్లుగా రాష్ట్రానికి చిల్లగవ్వ కూడా బీజేపీ ఇవ్వలేదని అన్నారు. ఇప్పుడెలా బీజేపీ అభ్యర్థులు తెలంగాణ ప్రజలను ఓట్లు అడుగుతారని మండిపడ్డారు. కేంద్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ.. తెలంగాణకు ఏం చేసిందో చెప్పి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ అరెస్ట్‌‌ను అన్యాయం అంటున్న కాంగ్రెస్ నేతలకు కవిత అరెస్ట్ కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.


Next Story

Most Viewed