IPL 2023: 'మరో డబుల్ ధమాకా'.. ముంబైతో కోల్‌కతా ఢీ.. మరో మ్యాచ్‌లో రాజస్థాన్ vs గుజరాత్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్..

by Disha Web Desk 13 |
IPL 2023: మరో డబుల్ ధమాకా.. ముంబైతో కోల్‌కతా ఢీ.. మరో మ్యాచ్‌లో రాజస్థాన్ vs గుజరాత్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్..
X

న్యూఢిల్లీ: ఐపీఎల్-16లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు బ్యాటింగ్, బౌలింగ్ పరంగా మిగతా జట్లతో పోలిస్తే పటిష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు లీగ్‌లో ఈ రెండు జట్లు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట గెలిచాయి. అలవోకగా 200 పరుగులు సాధించే ఈ రెండు జట్లు తలపడితే కచ్చితంగా పరుగుల వరద ఖాయమే అని చెప్పొచ్చు. నేడు అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7:30 గంటలకు రాజస్థాన్, గుజరాత్ జట్ల మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. యశస్వి జైశ్వాల్, బట్లర్, శాంసన్ రాజస్థాన్ బ్యాటింగ్‌ దళానికి ప్రధాన బలం కాగా.. హెట్మేయర్, ధ్రువ్ జురెల్ వంటి హిట్టర్లు ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసిరానుంది.

బౌలింగ్‌లో రాజస్థాన్ జట్టు ముఖ్యంగా స్పిన్ దళాన్నే నమ్ముకోగా.. పేసర్లు బౌల్ట్, హోల్డర్ సైతం మంచి ఫామ్‌లోనే ఉన్నారు. మరోవైపు, గుజరాత్ బ్యాటింగ్ దళంలో కాస్త నిలకడలేమి ఉన్నా.. ప్రతి మ్యాచ్‌లో సమిష్టిగానే రాణిస్తున్నది. శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. డేవిడ్ మిల్లర్, విజయ శంకర్,రాహుల్ తెవాటియా టచ్‌లో ఉండటం జట్టుకు మిడిలార్డర్‌లో బలం చేకూర్చనుంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యానే ఇప్పటివరకు బ్యాటుతోపాటు బంతితోనూ తన స్థాయి ప్రదర్శన చేయలేకపోయాడు. అతను సైతం పుంజుకుంటే జట్టులో మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

కోల్‌కతాపై ముంబై జోరు కనబర్చినా..?

డబుల్ హెడర్ మ్యాచ్‌ల్లో భాగంగా నేడు మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగే తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడబోతున్నాయి. పాయింట్స్ టేబుల్‌లో కోల్‌కతా 4 పాయింట్లతో 4వ స్థానంలో ఉండగా.. ముంబై 2 పాయింట్లతో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్నది. హైదరాబాద్ చేతిలో ఓటమిపాలైన కేకేఆర్ ఈ మ్యాచ్‌తో పుంజుకోవాలని భావిస్తుండగా.. గత మ్యాచ్‌తోనే బోణీ కొట్టిన ముంబై జట్టు అదే జోరును కొనసాగించాలని అనుకుంటున్నది. ముంబైలో స్టార్లు ఉన్నా విఫలమవడం జట్టుకు భారీ నష్టాన్ని కలిగిస్తున్నది. గత మ్యాచ్‌తో రోహిత్ టచ్‌లోకి రావడం ముంబైకి సానుకూలంశం. మిడిలార్డర్‌లో తిలక్ వర్మ ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు ప్రధాన బలం. అయితే, ఇషాన్ కిషన్, సూర్యకుమార్, గ్రీన్, టిమ్ డేవిడ్ భారీ ఇన్నింగ్స్ ఆడితేనే ఆ జట్టుకు విజయావకాశాలు మెరుగయ్యే చాన్స్‌ ఉంది.

బౌలింగ్‌లో పేసర్ జాసన్ బెహ్రెండోర్ఫ్, స్పిన్నర్ పీయూష్ చావ్లా మాత్రమే నిలకడగా వికెట్లు తీస్తున్నారు. మిగతా బౌలర్లు వీలైనంత త్వరగా ఫామ్ సాధించాల్సిన అవసరం ఉన్నది. మరోవైపు, గుర్బాజ్, నితీశ్ రాణా, వెంకటేశ్ అయ్యర్, రింకు సింగ్‌లతో కోల్‌కతా బ్యాటింగ్ దళం పటిష్టంగా ఉన్నది. భారీ హిట్టర్ ఆండ్రీ రస్సెల్ ఇప్పటివరకు మెరుపులు మెరిపించలేకపోయాడు. అతనితోపాటు సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్ రాణిస్తే కేకేఆర్‌కు తిరుగుండదు. స్పిన్నర్లు సూయష్ శర్మ, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ కోల్‌కతా బౌలింగ్ దళంలో కీలక పాత్ర పోషిస్తుండగా.. పేసర్లు సౌథీ, ఉమేశ్ యాదవ్, ఫెర్గూసన్ నుంచి జట్టు మంచి ప్రదర్శన ఆశిస్తున్నది.

Next Story