HYD: ఎల్బీనగర్‌ కోర్టు సంచలన తీర్పు

by Disha Web Desk 2 |
HYD: ఎల్బీనగర్‌ కోర్టు సంచలన తీర్పు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: భార్య, కూతురిని కిరాతకంగా హత్య చేసిన వ్యక్తికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష, పదివేల రూపాయల జరిమానా విధిస్తూ ఎల్బీనగర్ 9 ఏడీజే​కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరునెలలపాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొంది. అదనపు డీసీపీ పీ.శ్రీనివాసరావు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చేవెళ్ల గ్రామం అంగడిబజార్​నివాసి రోజా (25) వృత్తిరీత్యా కూలీ. చేవెళ్లకే చెందిన రాజు (35)ను ఆమె అయిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. నాలుగేళ్ల శ్రవణ్, ఒకటిన్నర సంవత్సరాల వయసున్న కీర్తన వీరి సంతానం. కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగినా ఆ తరువాత రాజు తరచూ రోజాతో గొడవలు పడటం మొదలుపెట్టాడు. పలుమార్లు భౌతికంగా కూడా దాడులు చేశాడు. ఎప్పటిలానే 2019, ఫిబ్రవరి 14న సాయంత్రం 5.30గంటలకు ఇంటికి వచ్చిన రాజు భార్య రోజాతో ఘర్షణ పడ్డాడు. అప్పటికే అతని వేధింపులు మితిమీరి పోవటంతో రోజా ఇలాగే గొడవలు పడితే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది.

దాంతో రెచ్చిపోయిన రాజు నువ్వేంది ఆత్మహత్య చేసుకునేది, నేనే నిన్ను చంపేస్తానంటూ ఆమెతోపాటు చిన్నారి కీర్తనపై కిరోసిన్ చల్లి నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయాడు. మంటలబాధ భరించలేక తల్లీకూతుళ్లు పెట్టిన కేకలు విన్న ఇరుగుపొరుగువారు పరుగున అక్కడకు వచ్చి మంటలార్పారు. విషయం తెలిసి సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రోజా, కీర్తనలను ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ కీర్తన ఆ మరుసటి రోజు చనిపోగా రోజా మూడు రోజుల తరువాత తుదిశ్వాస వదిలింది. కాగా, చికిత్స పొందుతున్న సమయంలో రోజా నుంచి సీఆర్పీసీ 162 ప్రకారం ఎస్సై హన్మంత్​రెడ్డి వాంగ్మూలాన్ని రికార్డు చేసి ఐపీసీ 498ఏ, 307 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. కాగా, చికిత్స పొందుతూ తల్లీకూతుళ్లు మరణించటంతో ఐపీసీ 302, 307, 498ఏ సెక్షన్లుగా మార్చారు.

అనంతరం ఇన్స్​పెక్టర్​గురువయ్య కేసు విచారణను చేపట్టారు. ఈ క్రమంలోనే 2‌‌019, ఫిబ్రవరి 18న నిందితుడైన రాజును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ఛార్జిషీట్​దాఖలు చేశారు. కేసును విచారించిన జడ్జి నిందితుడైన రాజుకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. నిందితునికి శిక్ష పడేలా కేసు విచారణ జరిపి కోర్టుకు ఆధారాలు సమర్పించిన ఇన్స్​పెక్టర్​గురువయ్య, కోర్టు డ్యూటీ ఆఫీసర్లు సీ.రాము, డీ.రఘు, కానిస్టేబుల్​సీహెచ్.కృష్ణంరాజు, బ్రీఫింగ్​ఆఫీసర్​ఎన్.పంకజ, హెడ్​కానిస్టేబుల్​జానయ్యలను సైబరాబాద్​కమిషనర్​స్టీఫెన్​రవీంద్ర అభినందించారు.



Next Story

Most Viewed