రామమందిరానికి వివిధ రాష్ట్రాల నుంచి అందిన కానుకలివే!

by Dishanational2 |
రామమందిరానికి వివిధ రాష్ట్రాల నుంచి అందిన కానుకలివే!
X

దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం సోమవారం జరగనున్న విషయం తెలిసిందే. దీనిని సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఇప్పటికే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి విరాళాలు అందజేశారు. అయితే ఏయే రాష్ట్రం నుంచి ఏమేం విరాళాలు అందాయో ఓ సారి పరిశీలిద్దాం.

కశ్మీర్ కుంకుమ పువ్వు

కశ్మీర్ నుంచి తీసుకొచ్చిన రెండు కిలోల కుంకుమ పువ్వును విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్ శ్రీరామ మందిరానికి అందజేశారు. ఇది స్వచ్చమైన కుంకుమ పువ్వు అని అలోక్ తెలిపారు. కశ్మీర్ కు చెందిన ముస్లింలు దీనిని తనకు అందజేసినట్టు వెల్లడించారు.

తమిళనాడు నుంచి సిల్క్ బెడ్‌షీట్

తమిళనాడుకు చెందిన పట్టు తయారీ దారులు సిల్క్ బెడ్ షీట్‌ను అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇచ్చారు. దీనిని 10 మంది కలిసి పది రోజులు తయారు చేశారు. శ్రీరామ మందిరాన్ని వర్ణించేలా ఉండటమే దీని ప్రత్యేకత.

అలీఘర్ నుంచి లాక్

400 కిలోల బరువున్న ప్రపంచంలోనే అతిపెద్ద తాళాన్ని అలీఘర్‌కు చెందిన భక్తులు పంపినట్టు తెలుస్తోంది. ఈ భారీ తాళాన్ని రెండేళ్ల క్రితం సత్య ప్రకాష్ శర్మ, ఆయన భార్య రుక్మిణి శర్మ అనే వృద్ధ దంపతులు తయారు చేశారు.

హైదరాబాద్ లడ్డూలు

హైదరాబాద్‌కు చెందిన భక్తులు 1,265 కిలోల లడ్డూలను ప్రసాదంగా పంపారు. హైదరాబాద్‌లోని శ్రీరామ్ క్యాటరింగ్ సర్వీసెస్ ఈ ప్రసాదాన్ని తయారు చేసింది. 25 మంది పురుషులు 3 రోజుల పాటు లడ్డూలను సిద్ధం చేసినట్టు కేటరింగ్ సర్వీసెస్ యజమాని నాగభూషణం రెడ్డి తెలిపారు.

7000 దుప్పట్లు

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు మెహందీపూర్ బాలాజీ మందిర్ న్యాస్ 1,51,000 లడ్డూ ప్రసాదాల పెట్టెలను బహుమతిగా అందించినట్టు సమాచారం. అదనంగా, భక్తులకు పంపిణీ చేయడానికి 7,000 దుప్పట్లు కూడా పంపించారు.

108 అడుగుల అగర్‌బత్తీ

108 అడుగుల పొడవాటి అగరుబత్తీని గుజరాత్ నుంచి అయోధ్యకు తీసుకొచ్చారు. ఇది 3,610 కిలోల బరువు, సుమారు 3.5 అడుగులు ఉంటుంది. ఆవు పేడ, నెయ్యి, పూల పదార్దాలు, మూలికలను ఉపయోగించి దీనిని తయారు చేశారు. ఒకసారి వెలిగిస్తే దాదాపు నెలన్నర పాటు వెలిగి ఉండటమే దీని ప్రత్యేకత.

Next Story

Most Viewed