అయోధ్యలో అంతా ‘రామమయం’: 2000 క్వింటాళ్ల పూలతో అలంకరణ

by Dishanational2 |
అయోధ్యలో అంతా ‘రామమయం’: 2000 క్వింటాళ్ల పూలతో అలంకరణ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరం ఎక్కడ చూసినా రామనామస్మరణతో మారుమోగుతోంది. రామమందిరం గ్రాండ్ ఓపెనింగ్‌కు ముందు ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. ఇప్పటికే ఈ పోటోలను రామమందిర ట్రస్టు రిలీజ్ చేసింది. మరోవైపు రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఆదివారం నాటికి ఆరో రోజుకు చేరుకుంది. 114 కలశాల నీటిని ఉపయోగించి..రామ్ లల్లా విగ్రహానికి ఉత్సవ స్నానం చేయించనున్నారు. విగ్రహ ప్రతిష్టాపనకు ముందు జరిగే అతిముఖ్యమైన కార్యక్రమం ఇదే. ఇక, సోమవారం మధ్యాహ్నం 12:20కి జరిగే ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలిపింది. జనవరి 23 నుంచి రామ మందిరంలోకి సాధారణ ప్రజలను అనుమతించనున్నారు. ఉత్తరప్రదేశ్ డీజీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాల్లో 25000 మందికి పైగా యూపీ పోలీసులను మోహరించారు. ప్రతిష్టాత్మక వేడుకకు హాజరయ్యే ప్రతినిధులను స్వాగతించడానికి, సత్కరించడానికి ‘రామ్ రాజ్’తో కూడిన బహుమతులను అందజేయడానికి రామజన్మభూమి ట్రస్టు ఏర్పాట్లు చేసింది.

2000 క్వింటాళ్ల పూలతో అలంకరణ

సుమారు 2000 క్విటాళ్ల పూలతో అయోధ్య నగరాన్ని అలంకరించారు. అంతేగాక అయోధ్య నగరమంతా రాముడి భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని మొత్తం దీపాలతో నింపారు. ఇవి సందర్శకులను ఎంతో ఆకట్టు కోనున్నాయి. ఆలయ ట్రస్టు ఆహ్వానించిన 55 దేశాల విదేశీ ప్రతినిధులు ఆదివారం సాయంత్రం నాటికి అయోధ్యకు చేరుకోనున్నట్టు తెలుస్తోంది. వారంతా సోమవారం జరిగే వేడుకకు హాజరుకానున్నారు. అలాగే భారత్‌లోని సుమారు 7000 మందికిపైగా ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. మరోవైపు, ప్రాణ ప్రతిష్ట వేడుకను పుస్కరించుకుని ఢిల్లీలోని పురాణా ఖిలాలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన భారత-అంతర్జాతీయ రామాయణ మేళా ఆదివారం ముగియనుంది. ఇందులో స్థానిక, విదేశీ నాటక బృందాలు రామాయణంలోని వివిధ కృతులను ప్రదర్శిస్తున్నారు.

రెండు స్లాట్లుగా దర్శనం

ప్రాణప్రతిష్ట వేడుక జరిగిన మరుసటి రోజు(జనవరి 23) నుంచి భక్తులను రామమందిరంలోకి అనుమతించనున్నారు. దర్శన సమయాలను రెండు స్లాట్లుగా విభజించారు. ఉదయం 7 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 7 గంటల వరకు సందర్శకులకు అనుమతి ఉంటుంది. రామాలయంలోకి వెళ్లడానికి ట్రస్ట్ జారీచేసిన పాస్ తప్పనిసరిగా ఉండాలి. దానికోసం గుర్తింపు కార్డులను చూపించాల్సి ఉంటుంది. అయోధ్యలోని రామమందిరానికి రోడ్డు, రైలు లేదా విమాన మార్గాల ద్వారా చేరుకోవచ్చు. అలాగే లక్నో, గోరఖ్‌పూర్, ఢిల్లీ, ఇతర ప్రధాన నగరాల నుంచి ఉత్తరప్రదేశ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ద్వారా బస్సులు నడపనున్నాయి.

సరయూ ఘాట్‌లో అతిపెద్ద ఎల్ఈడీ స్క్రీన్

విగ్రహ ప్రాణ ప్రతిష్ట వేడుకను ప్రసారం చేయడానికి సరయూ నది ఘాట్‌లో భారతదేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఈ ఎల్ఈడీని గుజరాత్‌కు చెందిన ఓ కంపెనీ తయారు చేసింది. ‘ఈ మొత్తం స్క్రీన్ పొడవు 69 అడుగులు, ఎత్తు 16 అడుగులు ఉంటుందని గుజరాత్‌కు చెందిన కంపెనీ ఎండీ అక్షయ్ ఆనంద్ తెలిపారు.

Next Story

Most Viewed