ఏడు రాష్ట్రాల్లోనే 80% పాజిటివ్ కేసులు

by  |
ఏడు రాష్ట్రాల్లోనే 80% పాజిటివ్ కేసులు
X

430 జిల్లాలకు పాకిన వైరస్

దేశవ్యాప్తంగా 20 వేలు దాటిన సంఖ్య

దిశ, న్యూస్ బ్యూరో:
దేశం మొత్తం మీద ఏప్రిల్ 22 నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20 వేలు దాటింది. ఈ నెల 2వ తేదీ నాటికి కేవలం 211 జిల్లాల్లో మాత్రమే ఉన్న కరోనా వైరస్ ఇరవై రోజుల వ్యవధిలోనే 430 జిల్లాలకు పాకింది. దేశం మొత్తం మీద నమోదైన పాజిటివ్ కేసుల్లో ఏడు రాష్ట్రాల్లోనే సుమారు 80% కేసులు కేంద్రీకృతమై ఉన్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశం మొత్తం మీద కొత్తగా 1329 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో బుధవారం సాయంత్రం నాటికి మొత్తం కేసుల సంఖ్య 20,471కు చేరుకుంది. ఒక రోజు వ్యవధిలో 49 మంది చనిపోవడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 652కు చేరుకుంది.

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 16 వేల కేసులున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యికి చేరువవుతోంది. ఇక నగరాలవారీగా చూసుకుంటే దేశం మొత్తంమీద నమోదైన పాజిటివ్ కేసుల్లో సుమారు 8110 కేవలం ఏడు నగరాల్లోనే ఉన్నాయి. ముంబయి నగరంలో అత్యధికంగా 3,029 కేసులు నమోదుకాగా, ఢిల్లీలో 2,081, అహ్మదాబాద్‌లో 1,298, ఇండోర్‌లో 915, పూణెలో 660, హైదరాబాద్‌లో 592, జైపూర్‌లో 537 చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రాలవారీగా చూస్తే అత్యధిక కేసులు నమోదైన ఐదు రాష్ట్రాల్లోనే దాదాపు 60% ఉంది.

మహారాష్ట్రలో.. ముఖ్యంగా ముంబయి నగరంలో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది. ఫ్రతీ రోజు సగటున 500 కంటే ఎక్కువ కేసులే అక్కడ నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 431 కొత్త కేసులు (సాయంత్రం ఐదు గంటల సమయానికి) నమోదయ్యాయి. లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ దేశంలో సగటున రోజుకు 1500 కొత్త కేసులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 27న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించనున్నారు.

భారత్ :

మొత్తం కేసులు : 20,471

మృతులు : 652

రికవరీ : 3960

తెలంగాణ :

మొత్తం కేసులు : 943

మృతులు : 24

రికవరీ : 194

ఆంధ్రప్రదేశ్ :

మొత్తం కేసులు : 813

మృతులు : 24

రికవరీ : 120

Tags: Corona, 7 States, 80 % cases, 430 Districts, Maharashtra, Modi



Next Story

Most Viewed