గ్రేటర్‌లో 7248 గుంతలు..

by  |
Roads
X

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాలకు గుంతలు ఏర్పడ్డాయి. జూన్ మాసం నుంచి నేటి వరకు కురిసిన భారీ వర్షాలకు 7,248 గుంతలను గుర్తించగా, అందులో యుద్ధప్రతిపాదికన 6,321 గుంతలను పూడ్చారు. మిగతా గ్రేటర్ పాలకవర్గంతో పాటు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ గుంతల పూడ్చివేతకు చర్యలు తీసుకుంటున్నారు.

హైదరాబాద్ మహా నగరంలో వర్షా కాలంలో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను, గుంతలను పూడ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆయా సర్కిళ్లలో వర్షాలకు దెబ్బ తిన్న గుంతలను పూడ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా చేశారు. గ్రేటర్ పాలక వర్గం విస్తృతంగా పర్యటించి ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో గుంతల పూడ్చివేత వేగవంతమైంది. సమస్యలతో పాటు రోడ్ల పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టారు. పనుల పురోగతిపై మేయర్ గద్వాల విజయలక్ష్మి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి త్వరతిగతిన మరమ్మతు చర్యలు చేపట్టారు.

జూన్ నుంచి సికింద్రాబాద్ జోన్‌లో కురిసిన వర్షాలకు రోడ్లపై 1446 గుంతలకు గాను 1368 గుంతలకు మరమ్ముతులు పూర్తి చేశారు. అదే విధంగా కూకట్ పల్లి జోన్‌లో 1320 గుంతలకు 1141 పూడ్చారు. శేరిలింగంపల్లి జోన్‌లో 792 గుంటలకు 736 గుంతలకు మరమ్మతులు చేశారు. ఖైరతాబాద్ జోన్‌లో 1502 గుంతలకు 1420 పూర్తి చేశారు. చార్మినార్ జోన్‌లో గుర్తించిన 1063 గుంతలకు 931 పూర్తి చేశారు. ఎల్ బీ నగర్ జోన్‌లో 1175 గుంతలకు 1025 గుంతలను పూర్తి చేశారు. గుర్తించిన మిగిలిన 621 పాట్ హోల్స్ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Next Story

Most Viewed