ఈ ‘ఆరు యాప్స్’ తప్పనిసరి!

by  |
ఈ ‘ఆరు యాప్స్’ తప్పనిసరి!
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం ప్రపంచమంతా డిజిటల్ మయం. ఏ సర్వీస్ పొందాలన్నా.. జస్ట్ వన్ క్లిక్ దూరంలో ఉంటున్నాం. కొవిడ్ 19 కట్టడి విషయంలోనూ టెక్నాలజీ కీలక పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు. అందువల్లే మన ప్రభుత్వం ‘స్టే అలర్ట్.. స్టే సేఫ్ అండ్ స్టే కనెక్టెడ్ విత్ ద డిజిటల్ సర్వీసెస్’ అంటోంది. ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని యాప్స్ ఈ కరోనా టైమ్‌లో మన జీవితాలను కాస్త సులభతరం చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్‌లో ఈ 6 యాప్స్ తప్పనిసరిగా ఉండాలంటూ.. ‘గవర్నమెంట్ డిజిటల్ ఇండియా’ అధికారిక అకౌంట్‌లో ఇటీవలే ఓ ట్వీట్ చేసింది. మరి ఆ ఆరు యాప్స్ ఏమిటి? వాటి వాడకం వల్ల ఉపయోగాలేంటో తెలుసుకుందాం..

వీటిలో మొదటగా చెప్పుకోవాల్సింది ఆరోగ్యసేతు యాప్.

ఆరోగ్య సేతు యాప్

కరోనాను కట్టడికి ప్రజలను ప్రతి నిత్యం అలర్ట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మొబైల్ యాప్ ఆరోగ్యసేతు. కరోనా సోకిన వ్యక్తులను ట్రాక్ చేసి అప్రమత్తం చేసేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ ఈ యాప్‌ను రూపొందించింది. ఐవోఎస్‌తో పాటు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో బ్లూటూత్ ఆధారంగా పనిచేసే ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హెల్ప్‌లైన్ నంబర్లతో పాటు ఆరోగ్య శాఖ అందిచే ఆరోగ్య సమాచార వివరాలు, వైద్య సలహాలు ఆరోగ్యసేతు యాప్‌లో అందుబాటులో ఉంటాయి. కరోనా పాజిటివ్‌ వ్యక్తికి ఎంత దగ్గరగా ఉన్నామనేది జీపీఎస్, బ్లూటూత్ ద్వారా పరిశీలించి అంచనా వేస్తుంది. 11 భాషల్లో రూపొందించిన ఈ యాప్‌.. ప్రస్తుతం ఫీచర్, ల్యాండ్ ఫోన్లలోనూ అందుబాటులోకి వచ్చింది.

భీమ్ యూపీఐ

కరోనా ఉధృతి పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో క్యాష్‌లెస్ పేమెంట్స్ చేయడమే సురక్షితం. డీమానిటైజేషన్ సమయంలో డిజిటల్ పేమేంట్స్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ‘భీమ్ యూపీఐ’ యాప్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. మొబైల్ నంబర్ ద్వారా బ్యాంకు ఖాతా నుంచి క్యాష్ ట్రాన్స్‌ఫర్ లేదా పేమెంట్ సదుపాయాన్ని ఈ యాప్ కల్పిస్తుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఎక్కడ ఏ వస్తువులు కొన్నా.. ఈ డిజిటల్ పేమెంట్ యాప్ ద్వారా క్యాష్ పేమెంట్ చేయొచ్చు. గల్లీ కిరాణా షాపుల నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ స్టోర్ల వరకు భీమ్ యూపీఐని ఉపయోగించవచ్చు.

ఉమంగ్ యాప్

ఈ ఒక్క యాప్‌తో 600 సర్వీసులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన యుటిలిటీ సర్వీస్‌లు ఇందులో ఉన్నాయి. ఆధార్, పాన్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పీఎఫ్ వంటి సేవలను కూడా ఈ యాప్ ద్వారా పొందొచ్చు.

ఆయుష్ సంజీవని యాప్

కేంద్ర ప్రభుత్వం ఈ యాప్‌ను ఇటీవలే లాంచ్ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ నేతృత్వంలో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దీన్ని రూపొందించగా.. ఆయుర్వేద మందులకు సంబంధించిన సమాచారాన్ని ఇందులో పొందుపరిచారు. ఈ నేపథ్యంలో కొవిడ్-19 నివారణ కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ అశ్వగంధ, యష్టిమధు, గుడుచి పీప్లి, ఆయుష్ 64 మందులపై రీసెర్చ్ చేసేందుకు సిద్ధమైంది. ఆయర్వేద మందుల పనితీరు, వాటి వల్ల కలిగే లాభాలు కనీసం 50 లక్షల మందికి చేరువయ్యే లక్ష్యంతో ఈ యాప్‌ను తీసుకొచ్చామని హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ పేర్కొన్నారు.

జన ఔషధి సుగమ్ యాప్

ఇది జనరిక్ మెడిసిన్ మందుల వివరాలను తెలిపే యాప్. ప్రధాన మంత్రి జన ఔషధి కేంద్రాల ద్వారా ఇప్పటికే జన ఔషధి మందులను అతి తక్కువ ధరలో అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాప్‌లో జనరిక్ మెడిసిన్ మందుల ధరలు వివరాలు ఉంటాయి. అలానే మనం నివసించే ప్రాంతానికి సమీపంలోనే ఉండే జన ఔషధి కేంద్రాలను సూచిస్తుంది.

ఈ గ్రామ్ స్వరాజ్ యాప్

గ్రామానికి సంబంధించిన సమగ్ర సమచారం అందించే యాప్ ‘ఈ గ్రామ్ స్వరాజ్’. గ్రామాభివృద్ధి ప్రణాళిక రూపకల్పన, పనుల పురోగతి, వర్క్‌-బేస్డ్‌ అకౌంటింగ్‌ అన్నీ ఈ-గ్రామ స్వరాజ్‌ పోర్టల్‌ ద్వారా చేపట్టవచ్చు. పంచాయతీరాజ్‌ శాఖ రూపొందించిన ఈ పోర్టల్‌ ద్వారా గ్రామ సచివాలయాల కార్యకలాపాలు డిజిటల్‌ మోడ్‌లో నిర్వహించవచ్చు. ఏప్రిల్‌లో ఈ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. గ్రామ పంచాయతీల అభివృద్ధికి, గ్రామీణుల అవసరాలకు ఇది ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ ఈ యాప్ లాంచ్ సందర్భంగా తెలిపారు.



Next Story

Most Viewed