నీ కళ్లు చెబుతున్నాయీ…

by  |
నీ కళ్లు చెబుతున్నాయీ…
X

నా కళ్లు చెబుతున్నాయీ.. నిను ప్రేమించాననీ.. నా పెదవులు చెబుతున్నాయీ నిను ప్రేమించాననీ.. అనే పాట గుర్తింది కదా. ఇలా.. ఎదుటివారిపై మనకున్న భావన కళ్ల ద్వారా తెలిసినట్టుగానే.. మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అన్నది కూడా తెలుస్తుంది. అయితే కేవలం కళ్ల ద్వారా మాత్రమే కాదు. శరీరంలోని కొన్ని అవయావాలు మన ఆరోగ్య పరిస్థితిని తరచూ హెచ్చరిస్తూ ఉంటాయి. వీటిలో మన కళ్ళు, చర్మం, జుట్టు కాస్త ఎక్కువగా చెప్తుంటాయి. అయితే, ఆ హెచ్చరికలను మనం ఎలా తెలుసుకోవాలి.? చాలా సులభం. కళ్లు ఎర్రబడటం.. చర్మంపై మొటిమలు, ఎర్రటి బొబ్బలు.. జుట్టు రాలడం, తెల్ల వెంట్రుకలు.. వంటి లక్షణాలతో మన ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయొచ్చు.
వాటిని ఓ సారి పరిశీలిస్తే..
మన ఆరోగ్యానికి ఎలాంటి హాని జరిగినా మొదట దాని ప్రభావం మన కళ్లపై పడుతుంది. అందుకే మనం అనారోగ్యానికి గురైనప్పుడు వైద్యుని దగ్గరికి వెళ్తే.. ముందు కళ్లనే చెక్ చేస్తారు. కంటిలోని ఐరిస్ చుట్టూ తెల్లని వలయాలు ఉన్నట్టయితే, అవి ఎక్కువ కొలెస్ట్రాల్‌ను సూచిస్తాయి. అలాగే, ఎర్రని చారలుంటే, అలసట, నిద్రలేమిని సూచిస్తాయి. ఈ చారలు ముదురు ఎరుపు రంగులో ఉంటే డయాబెటిస్‌ వచ్చే అవకాశముంటుంది. కళ్ల వెంట తరచూ నీళ్ళు కారితే, నరాల సమస్య ఉండే అవకాశముంది. ఈ విధంగా కళ్లకు సంబంధించి ఏ మాత్రం తేడా కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
అలాగే, ప్రీ మోనోపాజ్ సమయంలో చర్మం ముడుతలుగా మారుతుంటే ఎముకలకు సంబంధించిన వ్యాధి ఉందని అర్థం. సూర్యకాంతి పడని అవయవాల్లోనూ ఈ సమస్య కనిపిస్తే.. అది అధిక రక్తపోటు వల్ల కావచ్చు. ఇది గుండె సంబంధిత వ్యాధులను సూచిస్తుంది. దద్దుర్లు ఏర్పడితే మీరు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని అర్థం.
మన జుట్టును బట్టి సైతం ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చు. జుట్టు, అవాంఛిత రోమాలు విపరీతంగా పెరుగుతున్నట్టయితే, మన శరీరంలో టెస్టోస్టిరాన్ ఉత్పత్తి ఎక్కువగా ఉన్నట్టు సూచిస్తుంది. అలాగే, పాలీసైస్టిక్ ఓవరి సిండ్రోమ్ కూడా మరో కారణంగా చెప్పొచ్చు. కనుబొమ్మల వెంట్రుకలు ఊడిపోతున్నట్టయితే, ఈ లక్షణం హైపర్ థైరాయిడిజం. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల, శరీరంలో ఐరన్ స్థాయిలు తగ్గిపోవడం వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది.
మన గోర్లు బలహీనంగా, పొలుసులుగా లేస్తూ, నొప్పిగా ఉంటే మనం పోషకాహారలోపంతో బాధపడుతున్నామని తెలుసుకోవాలి. గోర్ల ఆకృతిలో మార్పులు, వాటి చుట్టూ ఉన్న చర్మం ఊడిపోతుంటే, కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులున్నట్టు సూచిస్తాయి.
అయితే, ఇలాంటి లక్షణాలు కనిపించిన వారు కంగారుపడకుండా వైద్యులను సంప్రదించాలి.

అంధులకు వెలుగునిచ్చే ‘ఆర్టిఫీషియల్ కార్నియా’

Next Story

Most Viewed