నిఘా పెంచిన పోలీసులు.. 50 కేజీల నిషేధిత గంజాయి స్వాధీనం

by  |
నిఘా పెంచిన పోలీసులు.. 50 కేజీల నిషేధిత గంజాయి స్వాధీనం
X

దిశ, డోర్నకల్ : మరిపెడ సర్కిల్ పరిధిలో పోలీసులు 50 కిలోల నిషేధిత గంజాయిని పట్టుకున్నారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మరిపెడ పీఎస్‌లో గురువారం జిల్లా ఎస్పీ వెల్లడించారు. వివరాల ప్రకారం.. మరిపెడ పీఎస్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తన సిబ్బందితో మున్సిపాలిటీ పరిధిలోని సేవానగర్‌కు చెందిన బర్మావత్ శ్రీరాములు ఇంటి వద్ద తనిఖీలు నిర్వహించారు.

ఈ క్రమంలో ఓ కారుకు వెనుక వైపు ఉన్న ఇండికేటర్ లైట్ల వెనుక 24 ప్యాకెట్లలో 40 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ కారు భూక్యా సురేష్‌కు చెందినదిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. సురేష్ ఈ గంజాయి రవాణాకు శ్రీ రాములుకు సహకరించాడు. సీలేరు నుంచి ఈ గంజాయిని కిలో రూ.1500 చొప్పున కొనుగోలు చేసి.. ముంబై, ఒరిస్సాలో కిలో రూ. 7000లకు విక్రయిస్తూ అక్రమార్జన చేస్తున్నట్లు తెలిపారు.

అయితే శ్రీరాములుపై గతంలో ఏపీలోని తుని, మరెదుపల్లి, మోటాగూడెంలలో కేసులు ఉన్నాయని, ఇతనిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తున్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు. అదే విధంగా నర్సింహులపేట మండలంలో ఎస్ఐ లావూడియా నరేష్ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా కౌసల్యాదేవిపల్లి ఆఖరు వంతెన వద్ద అనుమానాస్పదంగా వెళ్తున్న దరంసోతు భద్రును తనిఖీ చేయగా 10 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే భద్రును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. గంజాయి రవాణాను అడ్డుకొని చాకచక్యంగా వ్యవహరించిన మరిపెడ సీఐ సాగర్ నాయక్, తొర్రుర్ సీఐ కరుణాకర్, మరిపెడ ఎస్ఐ ప్రవీణ్ కుమార్, నర్సింహులపేట ఎస్ఐ లావూడియా నరేష్, సిబ్బందిని అభినందించి రివార్డులు అందించారు.



Next Story

Most Viewed