'3M మాస్క్స్'తో ఎట్టకేలకు అమెరికా డీల్

by  |
3M మాస్క్స్తో ఎట్టకేలకు అమెరికా డీల్
X

వాషింగ్టన్ : అమెరికాలో మెడికల్, సర్జికల్ మాస్క్స్ తయారు చేసే అతి పెద్ద కంపెనీ ‘3M’తో గత కొన్ని రోజులుగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకపడుతున్నాడు. కరోనా ప్రభావంతో దేశంలో మాస్కుల కొరత ఏర్పడితే.. 3M కంపెనీ మాత్రం తమ మాస్కులను ఇతర దేశాలకు అమ్ముకుంటోందని ఆరోపించారు. ముందుగా అమెరికాకు అవసరమైన మాస్కులు అందజేయాలని ఆదేశించారు. ఎంతో మంది హెల్త్ వర్కర్లకు సరైన మాస్కులు అందట్లేదని.. 3M కంపెనీ మాత్రం ఇంకా ఇతర దేశాలకు మాస్కులు సప్లై చేస్తోందని.. వెంటనే స్థానికంగా పంపిణీ చేయకుంటే డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ ఉపయోగిస్తామని ట్రంప్ హెచ్చరించారు. దీంతో దిగివచ్చిన 3M కంపెనీ ప్రతీ నెల 55.5 మిలియన్ల మాస్కులను మూడు నెలల పాటు అమెరికా ప్రభుత్వానికి పంపిణీ చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. అంతకు ముందు 3M కంపెనీపై పలు విమర్శలు వచ్చాయి. దేశభక్తిని వదిలేసి.. కేవలం వ్యాపార ధోరణితో ఆ కంపెనీ ఎన్95 మాస్కులను ఇతర దేశాలకు భారీగా పంపిణీ చేసిందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆ కంపెనీ చైర్మన్ మైక్ రోమన్ స్పందిస్తూ.. మేం వ్యాపారం చేయడంతో పాటు.. ప్రతీ అమెరికన్‌కు మాస్కులు అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని అన్నారు. ఏ ఒక్క అమెరికన్, మెడికల్ సిబ్బంది కూడా మాస్కులు దొరకక ఇబ్బంది పడకూడదని.. మా సిబ్బంది నిరంతరం పని చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా, అమెరికా ఆరోపణలపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. ఈ క్లిష్ట సమయంలో 3M కంపెనీపై ఒత్తిడి తీసుకొని రావొద్దని అన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. మెడికల్ సామాగ్రిని రాకుండా చేయవద్దని ఆయన కోరారు. కాగా, అమెరికాతో పాటు తమ కంపెనీ కెనడా, లాటిన్ దేశాలకు అవసరమైన సామాగ్రిని పంపిణీ చేస్తామని 3M కంపెనీ ప్రకటించింది.

Tags: coronavirus, America, masks, manufacturer, 3M,deal

Next Story

Most Viewed