2020 సంవత్సరమా… మమ్మల్ని క్షమించు!

by  |
2020 సంవత్సరమా… మమ్మల్ని క్షమించు!
X

దిశ, వెబ్‌డెస్క్:
ఇంగ్లిషులో ఫైనల్ డెస్టినేషన్ సినిమాల సిరీస్ ఉంటుంది. అందులో ప్రతి సినిమాలోనూ ప్రారంభంలో ఒక ప్రమాదం జరుగుతుంది. అయితే ఆ ప్రమాదం జరగడానికి ముందే హీరోకి తెలుస్తుంది. దీంతో తనతో పాటు చనిపోబోయే ఒక ఆరుగురిని హీరో కాపాడతాడు. ఇక ఆ తర్వాత వారిలో ఒక్కొక్కరిని మృత్యువు ఒక్కోలా వెంటాడుతుంది. ప్రతీసారి హీరో కాపాడటానికి ప్రయత్నిస్తాడు. కానీ ఓడిపోతాడు. దీన్ని బట్టి విధిరాసిన మృత్యువును ఎవరూ తప్పించలేరనేది ఆ సినిమాల సారాంశం.

2020వ సంవత్సరం కూడా దాదాపు అలాగే ప్రవర్తిస్తోంది, అప్పట్లో 2012లో ప్రళయం వస్తుంది అందరూ పోతారు అని పుకారు పుట్టించారు. ఆ పేరుతో ఒక సినిమా వచ్చి పెద్ద హిట్ కూడా అయింది. మరి 2012లో తప్పించుకున్న సంక్షోభాలే ఇప్పుడు వస్తున్నాయనిపిస్తోంది. ఆస్ట్రేలియా కార్చిచ్చుతో మొదలై ఇప్పటి కరోనా వరకు… గ్యాప్ లేకుండా ఒకదాని మీద ఒకటి మీదపడుతూనే ఉన్నాయి.

ఇక భారతదేశ పరిస్థితి అయితే రెండ్రోజుల నుంచి ఫైనల్ డెస్టినేషన్ పరిస్థితే అయ్యింది. లాక్‌డౌన్ విధించి కరోనాను ప్రజలను కాపాడితే, అదే లాక్‌డౌన్ కారణంగా మూతపడిన ఎల్‌జీ పాలిమర్స్‌లో ఒక్కసారిగా పని ప్రారంభించడంతో స్టైరీన్ వాయువు విడుదలై ఇళ్లకే పరిమితమైన ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇక లాక్‌డౌన్ కారణంగా సొంతూళ్లకు వెళ్లడానికి పట్టాల మీద విశ్రమిస్తున్న వలస కూలీల ప్రాణాలు గాల్లో కలిశాయి. ప్రతి సాయంత్రం క్రికెట్ స్కోర్ చూడాల్సిన సమయంలో కరోనా పాజిటివ్ కేసుల స్కోర్ చూడాల్సి వస్తుంది. రోజూ పొద్దున్నే కనీసం ఒక్క అశుభ వార్త అయినా వినాల్సి వస్తోంది. ఇలా ఏ రకంగా చూసినా 2020 సంవత్సరం మానవాళికి చుక్కలు చూపిస్తోంది.

అయితే ఇదంతా చేసిన తప్పులకు ప్రతిఫలం అని నెటిజన్లు అంటున్నారు. చెప్తున్నా వినకుండా ప్లాస్టిక్ వాడటం, అవసరానికి మించిన వనరులను వినియోగించడం, వస్తువులను ప్రేమించి, మనుషుల్ని దూరం చేసుకోవడం, అసలైన ఆరోగ్యాన్ని వదిలి డబ్బు వెనక ఉద్యోగం వెనక పరిగెత్తడం, ఆ పరుగులో భాగంగా ప్రకృతిని పట్టించుకోకపోవడం, అభివృద్ధి, విలాసం పేరుతో అనవసరమైన వాటికి ప్రాధాన్యతనివ్వడం ఇలాంటి అన్ని పాపాల కారణంగానే 2020 ఇలా ప్రకృతి ప్రతీకార సంవత్సరంగా మారిందని సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ప్రాణాలు, ఆరోగ్యం, కుటుంబానికి మించినది ఈ ప్రపంచంలో ఏదీ లేదని 2020 రుజువు చేస్తోంది. అనుకున్నట్లుగానే ఈ లాక్‌డౌన్ కాలంలో చాలా మందికి ఈ విషయంలో జ్ఞానోదయం కూడా అయిందని కొందరు మానసిక నిపుణులు అంటున్నారు. అందుకే ఇక నుంచైనా అవసరమైన వాటికే ప్రాధాన్యత ఇస్తామని మాటిస్తూ మా తప్పుని ఒప్పుకుంటూ… వీలైతే 2020 సంవత్సరమా మమ్మల్ని క్షమించు!

Tags: corona, covid, lockdown, 2020 bad year, own mistakes, value first, family first


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed