పొడుగు కాళ్ల సుందరి.. గిన్నిస్ సొగసరి

by  |
పొడుగు కాళ్ల సుందరి.. గిన్నిస్ సొగసరి
X

దిశ, వెబ్‌డెస్క్: ‘నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు, నా చూపులనలా తొక్కుకు వెళ్లకు దయలేదా నీకు’.. ఈ పాట వినగానే అందమైన కాళ్లు మనముందు అలా కదలాడుతుంటాయి. కానీ అమెరికాకు చెందిన మెసీ కురిన్ అనే టీనేజర్ కాళ్లను చూస్తే మాత్రం.. ‘అయ్ బాబోయ్ ఎంత పొడుగో’ అని ఆశ్చర్యపోతారు. అందుకే ప్రపంచంలోనే అతి పొడవైన కాళ్లతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది 17 ఏళ్ల మెసీ.

మెసీ కురిన్ చిన్నప్పటి నుంచే చాలా పొడువు. తను 9 ఏళ్ల వయస్సులోనే 5.7 అడుగుల పొడవు ఉండేది. ఫ్యామిలీలోనూ ఆమె తండ్రి 6 అడుగుల 5 ఇంచుల పొడవైతే, వాళ్ల తమ్ముడు 6 అడుగుల 3 ఇంచుల పొడవు ఉన్నారు. ఇక మెసీ విషయానికొస్తే.. ఆమె లెఫ్ట్ లెగ్ 136.267 సెంటిమీటర్ల (53.255ఇంచులు), ఆమె రైట్ లెగ్ 134.3సెంటిమీటర్లు (52.874 ఇంచులు) ఉన్నాయి. ఈ 17 ఏళ్ల పొడగరి ఎత్తు.. 6 అడుగుల పది ఇంచులు కాగా, కేవలం ఆమె కాళ్లే 4 అడుగుల 5 ఇంచులు పొడవు. అంటే ఆమె శరీరంలో సగం కంటే ఎక్కువ కాళ్లే ఉంటాయి. దీంతోఅతి పొడవైన కాళ్లు కలిగిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది.

2017లో రష్యాకు చెందిన ఎకాటెరినా లెసినా అతి పొడవైన కాళ్లు కలిగిన వ్యక్తిగా సాధించిన రికార్డును ప్రస్తుతం మెసీ బ్రేక్ చేసింది. ఎకాటెరినా ఎత్తు 6 అడుగుల 8.77 ఇంచులు కాగా, ఆమె కాళ్ల పొడవు 132 సెంటిమీటర్లు. ‘‘కాళ్లు పొడవుగా ఉండటం కాస్త ఇబ్బందే. అయినా.. ఎప్పుడూ వాటి గురించి బాధపడలేదు, నిజానికి గర్వంగా భావిస్తాను. నా కాళ్లకు సరిపడా దుస్తులు దొరకడం కూడా కష్టమే. అందుకే, నా దుస్తులను ప్రత్యేకంగా కుట్టించుకుంటున్నాను’ అని తెలిపింది మెసీ. అంతేకాదు, పొడవైన వారు తమ ఎత్తుతో సిగ్గుపడకూడదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పొడగరులకు తాను స్ఫూర్తిగా నిలిచేలా ఉండాలనుకుంటున్నట్లు ఆమె పేర్కొంది. భవిష్యత్తులో మోడల్‌‌గా రాణించాలని అనుకుంటోంది మెసీ.

Next Story