కొండ చరియలు విరిగిపడి 17 మంది మృతి

by  |
కొండ చరియలు విరిగిపడి 17 మంది మృతి
X

తిరువనంతపురం: కేరళలో కురుస్తున్న భారీ వర్షాలతో కొండ చరియలు విరిగిపడి ఇదుక్కి జిల్లాలో 17 మంది మరణించారు. మరణించిన వారిలో తమిళనాడుకు చెందిన 9 మంది ఉన్నట్టు తెలుస్తోంది. మరో 80 మంది వరదలతో కొట్టుకొచ్చిన బురద కింద గల్లంతయ్యారు. 15 మందిని ఈ శిథిలాల నుంచి వెలికి తీశారు. ప్రస్తుతం వారు మున్నార్‌లోని టాటా జనరల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఇదుక్కి జిల్లా రాజమలై ఏరియాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

మున్నార్‌కు 25 కిలోమీటర్ల దూరంలోని రాజమలై ఏరియాలో సుమారు 78 మంది టీ వర్కర్లు జీవిస్తున్నారు. గురువారం కురిసిన వర్షాలతో కొండచరియలు విరిగి, బరదతో కలిసి నివాసాలను ముంచెత్తాయి. రాజమలైను అనుసంధానించే బ్రిడ్జీ కూడా గురువారం కురిసిన వర్షానికి ధ్వంసమైంది. కొండప్రాంతం కావడం, బ్రిడ్జీ సౌకర్యం లేకపోవడంతో రక్షణ చర్యలు సవాలుగా మారాయని తాలూక అధికారులు తెలిపారు.

50 సభ్యులతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను సహాయక చర్యల కోసం స్పాట్‌కు తరలించినట్టు సీఎం పినరయి విజయన్ వెల్లడంచారు. రక్షణ సహాయార్థం హెలికాప్టర్లు అందించాల్సిందిగా ఐఏఎఫ్‌ను సీఎంవో అభ్యర్థించింది. కాగా, ఒక ఎన్‌డీఆర్ఎఫ్ టీం కూడా రాజమలై చేరిందని, మరో టీం త్రిస్సూర్ నుంచి బయల్దేరిందని సీఎం వివరించారు. అంతేకాదు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఫారెస్ట్, రెవెన్యూ అధికారులూ రక్షణ చర్యల్లో పాల్గొనాలని సూచించారు.

ఆరోగ్య సేవలందించడానికి ఒక మొబైల్ మెడికల్ టీం‌మ్‌ను, 15 అంబులెన్సులను పంపించినట్టు రాష్ట్ర హెల్త్ మినిస్టర్ కేకే శైలజా తెలిపారు. ఇదుక్కితోపాటు ఎర్నాకుళం, వయానాడ్, త్రిస్సూర్‌లోనూ భారీగా వర్షాలు కురిశాయి. పెరియర్ నదిలో ప్రవాహ ఉధృతి పెరగడంతో ఎర్నాకుళంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. అలువాలోని శివాలయం వరదల్లో మునిగిపోయింది. వయానాడ్‌లోనూ కొండచరియలు విరిగిపడ్డాయి. కురిచియర్‌మాలా ఏరియాలో రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షంతో పనమారం ప్రాంతం పూర్తిగా నీటితో నిండిపోయింది.

రెడ్ అలర్ట్..

ఇదుక్కి, వయానాడ్, కొట్టాయం, పతానమిట్ట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. త్రిస్సూర్‌కూ మరోసారి రెడ్ అలర్ట్ జారీ చేసింది. మొత్తం 11 జిల్లాలో శనివారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది.

Next Story

Most Viewed