వణుకుతున్న పల్లెలు.. 116 గ్రామాల్లో సెల్ఫ్ లాక్‌డౌన్

by  |
వణుకుతున్న పల్లెలు.. 116 గ్రామాల్లో సెల్ఫ్ లాక్‌డౌన్
X

దిశ, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరోనా చక్రబంధంలో చిక్కుకుపోయింది. కరోనా పాజిటివ్ కేసులు నిత్యకృత్యంగా మారడం, మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటంతో కరీంనగర్ జిల్లా వాసులు తల్లడిల్లిపోతున్నారు. దీంతో పల్లె, పట్నం అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనన్న భయంతో కాలం వెల్లదీస్తున్నారు. మాయదారి కరోనా ఎంతపని చేస్తోందంటూ ఆందోళన చెందుతున్నారు.

లాక్‌డౌన్ దిశగా..

ఉమ్మడి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రజలే స్వీయ నిర్భంద చర్యలకు శ్రీకారం చుడుతున్నారు. జగిత్యాల జిల్లా రాష్ట్రంలోనే మొదటి వరుసలో నిలుస్తోంది. జిల్లాలో 376 గ్రామాలు ఉంటే ఇప్పటివరకు 116 గ్రామాల్లో సెల్ఫ్ లాక్‌డౌన్ అమలవుతోంది. సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో 10 నుండి 20 గ్రామాలు స్వీయ నిర్భంధంలోకి వెళ్లాయి. ఆయా చోట్ల ప్రజలకు బయటకు రాకుండా ఎవరి ఇళ్లకు వారే పరిమితం అవుతున్నారు.

దుకాణాలు బంద్…

కరీంనగర్‌ పట్టణంతో పాటు ఉమ్మడి జిల్లాలోని చాలా గ్రామాల్లో సెల్ఫ్ లాక్‌డౌన్ అమలు కాకున్నప్పటికీ దుకాణ దారులు మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసకుంటున్నారు. చాలా మంది షాపులు తెరవకుండా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కరీంనగర్ నగరం ఆటోమొబైల్ రంగంలో ప్రత్యేక ప్రగతి సాధించింది. నగరంలోని కమాన్ రోడ్, కోతిరాంపూర్, ఆటోనగర్ ప్రాంతంలో వేలాది వాహనాల రాకపోకలు సాగిస్తుండగా, ఆటోమొబైల్ వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతుంటుంది. సెకండ్ వేవ్ కారణంగా ఈ రోడ్డపై ప్రస్తుతం పదుల సంఖ్యలో కూడా వాహనాలు తిరగడం లేదు.

పారిశ్రామిక ప్రాంతంలో…

పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా కేసులు వందల సంఖ్యలో వెలుగుచూస్తున్నాయి. రోజువారీగా కరోనా మరణాలు సర్వసాధారణం అయ్యాయి. దీంతో సింగరేణి సంస్థ కూడా కార్మికులకు ఉచిత చికిత్స అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సింగరేణి ఆస్పత్రిలోనే ప్రత్యేక కొవిడ్ వార్డులను కూడా ఏర్పాటు చేయాల్సి వచ్చింది.



Next Story

Most Viewed