భారత్‌లో ఒక్కరోజే 11,502 కేసులు

by  |
భారత్‌లో ఒక్కరోజే 11,502 కేసులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: భారత్‌‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్రత ప్రమాదకరస్థాయిలో కొనసాగుతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం బులెటిన్ విడుదల చేసేసరికి గడిచిన 24 గంటల్లో ఏకంగా 11,502 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3,32,424కు చేరింది. ఒక్కరోజే కరోనాతో 325 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 9520కి చేరింది. కరోనా బాధితుల్లో ఇప్పటివరకు 1,69,798 మంది కోలుకోగా 1,53,106 మంది ఆస్పత్రుల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి రోజురోజుకు ఎక్కువవుతోంది. దేశంలోనే ఇప్పటివరకు ఎక్కువ కేసులు నమోదైన మహారాష్ట్రలో ఒక్కరోజే 2786పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నమోదైన కేసుల్లో ఇదే ఇప్పటివరకు అత్యధిక సంఖ్య కావడం కలవరం కలిగిస్తోంది. కొత్తగా రికార్డైన కేసులతో కలిపి మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 1,10,744కి చేరింది. గడిచిన 24 గంటల్లో 178 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. రాజధాని ముంబైలో ఒక్కరోజే 1066 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 58 మంది కరోనాతో మరణించారు. ముంబైలో మొత్తం కేసుల సంఖ్య 59,201కి చేరింది. కరోనాతో 2248 మంది చనిపోయారు.

తమిళనాడులో ఒక్కరోజే 1843 కొత్త కేసులు నమోదవడంతో.. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య46,504కి చేరింది. కరోనాతో సోమవారం 44 మంది మరణించడంతో ఇక్కడ ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 479కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కరోజులో 1647 కేసులు నమోదవడంతో.. మొత్తం కేసుల సంఖ్య 42,829కు చేరింది. దేశ రాజధానిలో కరోనా బారిన పడి గడిచిన 24 గంటల్లో 73మంది మరణించడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1400కి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజే కొత్తగా 246 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 5087కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా ఇద్దరు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో మహమ్మారి కారణంగా ఇప్పటివరకు 86 మంది మరణించారు.



Next Story

Most Viewed