Private schools closed in Telangana: కరోనా ఎఫెక్ట్.. మూసివేతకు ప్లాన్స్ చేస్తున్న ప్రైవేటు స్కూల్స్

by  |
Private schools closed in Telangana: కరోనా ఎఫెక్ట్.. మూసివేతకు ప్లాన్స్ చేస్తున్న ప్రైవేటు స్కూల్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రైవేటు పాఠశాలలు మూసివేత దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,082 ప్రైవేటు స్కూళ్లు తెరుచుకోలేదు. టీచర్లకు జీతాలు చెల్లించలేక, పాఠశాల నిర్వహణ ఖర్చులను భరించలేక యాజమాన్యాలు పాఠశాలలు తెరిచేందుకు వెనకడుగు వేస్తున్నాయి. దీనికి తోడు ఇప్పటి వరకు తెరుచుకున్న పాఠశాలల్లో ఆశించిన స్థాయిలో విద్యార్థులు రాకపోవడంతో ఆన్‌లైన్ తరగతులను నిర్వహించేందుకే మొగ్గు చూపుతున్నారు.

కొవిడ్ పరిస్థితుల కారణంగా ప్రైవేటు టీచర్లతో పాటు యాజమాన్యాలను రోడ్డున పడ్డారు. చిన్న బడ్జెట్ స్కూల్స్ చాలా వరకు పాఠశాల నిర్వహణకు సాహసం చేయడం లేదు. ఫిజికల్ తరగతులు ప్రారంభించినప్పటికీ ఇంకా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించేందుకే మొగ్గు చూపుతున్నారు.

ఆర్థిక ఇబ్బందులతో పాఠశాలలను కొనసాగించాలా.? లేక మూసివేయాలని చాలా వరకు యజమానులు సతమతమవుతున్నారు. ఫిజికల్ తరగతులకు పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపకపోవడంతో చాలా వరకు ప్రైవేటు పాఠశాలలు మూతపడనున్నాయి.

రాష్ట్రంలో తెరుచుకోని 1,082 ప్రైవేటు స్కూల్స్..

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,816 ప్రైవేటు పాఠశాలలుండగా వీటిలో ఇప్పటి వరకు 9,734 పాఠశాలలు తెరుచుకున్నాయి. 1,082 చిన్న బడ్జెట్ ప్రైవేటు స్కూల్స్ ఇప్పటి వరకు తెరుచుకోలేదు. ప్రైవేటు పాఠశాలల్లో 31.91లక్షల మంది విద్యార్థులుండగా వీరిలో 7.54 లక్షల మంది విద్యార్థులు మాత్రమే పాఠశాలకు హాజరయ్యారు.

విద్యార్థుల హాజరు శాతం తక్కువగా నమోదు అవుతుండటంతో చాలా వరకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఆన్‌లైన్ తరగతులను బోధించేందుకు ఆసక్తి చూపుతున్నారు. తిరిగి వైరస్ వ్యాప్తి జరగకుండా ఉంటే పూర్తి స్థాయిలో ఫిజికల్ తరగతులను నిర్వహించాలని ఆలోచిస్తున్నారు.

ఆర్థిక ఇబ్బందులతో మూతపడుతున్న స్కూల్స్..

ఆర్థిక ఇబ్బందులతో పాఠశాలలను ప్రారంభించలేక చిన్న బడ్జెట్ స్కూల్స్ మూతపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖర్చులకు భయపడి ఫిజికల్ తరగతులను ప్రారంభించేందుకు యాజమాన్యాలు వెనకడుగు వేస్తున్నాయి. ఫీజులు వసూలు కాని పరిస్థితుల్లో టీచర్లకు జీతాలు ఇవ్వలేమని నిర్ణయానికి వచ్చి ఫిజికల్ తరగతులను నిర్వహించడం లేదు.

పాఠశాల నిర్వహణకు, బస్ సౌకర్యం ఏర్పాటు చేసేందుకు, బిల్డింగ్ రెంట్లను చెల్లించేందుకు లక్షల్లో ఖర్చు వస్తుందని ఆలోచిస్తున్నారు. అప్పులు తీసుకువచ్చి స్కూల్స్‌ను ప్రారంభించిన తరువాత థర్డ్ వేవ్ ప్రబలితే నష్టాలను భరించలేమని సాహసం చేయడం లేదు.

నెలకు రూ.4 లక్షల వరకు ఖర్చు: ప్రైవేటు స్కూల్ యాజమాని, రాంనగర్

రాంనగర్ ఏరియాలో నాకు స్కూల్ ఉంది. 10వ తరగతి వరకు నిర్వహిస్తున్నాను. కొవిడ్ రాకముందు వరకు అంతా సజావుగా సాగింది. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నెల నెలా జీతాలు చెల్లించాం. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా పాఠశాల నిర్వహించాం. ప్రస్తుతం పరిస్థితులు తలకిందులయ్యాయి. ఫీజులు వసూలు కాకపోవడంతో ఆర్థికంగా చితికిపోయి ఉన్నాం.

ఫిజికల్ తరగతులను ప్రారంభించాలంటే ఇప్పడు ఉన్న పరిస్థితుల్లో స్కూల్ క్లీనింగ్, శానిటైజేషన్‌కు రూ. 25వేల వరకు ఖర్చు వస్తోంది. పెండింగ్‌లో ఉన్న కరెంట్ బిల్లులు, టీచర్ల జీతాలు చెల్లించేందుకు రూ. 2 లక్షలు, బిల్డింగ్ రెంట్‌కు రూ.80 వేలు, బస్సుల నిర్వహణ, ఇతర అనుమతులకు, సదుపాయాలకు మరో రూ.1 లక్షల మొత్తం రూ.4లక్షల వరకు ఖర్చు వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అంత ఖర్చు భరించలేము. థర్డ్ వేవ్ వస్తే ఇక స్కూల్స్‌ను మూసివేయాలి అనుకుంటున్నాం.

పూర్వ వైభవం వస్తుందని ఆశగా ఉన్నాం : ఉమామహేశ్వర్, స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు

విద్యార్థుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతున్నది. పూర్వ వైభవం వస్తుందనే ఆశతో ఫిజికల్ తరగతులు ప్రారంభించాం. ఫీజులు చెల్లించడం ఇష్టం లేక చాలా మంది తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నారు. థర్డ్ వేవ్ లేకపోతే విద్యార్థులు మళ్లీ ప్రైవేటు స్కూల్స్ వైపు వస్తారు. ఆ సమయం కోసం ఎదురుచూస్తున్నాం.

Next Story

Most Viewed