ఎండిన పల్లె ప్రకృతి వనాలు.. పట్టించుకోని పంచాయతీ కార్యదర్శులు

by Disha Web Desk 23 |
ఎండిన పల్లె ప్రకృతి వనాలు.. పట్టించుకోని పంచాయతీ కార్యదర్శులు
X

దిశ, మంగపేట : పల్లెల్లో పచ్చదనం నింపి చెట్లను పెంచి వాటి పచ్చదనం నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలితో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో ప్రతి గ్రామ పంచాయతీ దాని హాబిటేషన్ లో పల్లె ప్రకృతి, బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. ప్రతి గ్రామంలోని పల్లె ప్రకృతి వనం అక్కడ ఉన్న ప్రభుత్వ, అటవీ భూముల వెసులుబాటును బట్టి ఎకరం నుండి ఐదు ఎకరాల భూమిని సేకరించి చెట్లను పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందు కోసం ఎన్ఆర్ఈజీఎస్, గ్రామపంచాయతీ, హరితహారం పేరుతో నిధులు మంజూరు చేసి ప్రతి పల్లె ప్రకృతి వనాల్లో నీడనిచ్చే చెట్లతో పాటు పండ్ల మొక్కలు, ప్రకృతి అందాల నిచ్చే మొక్కలను తెచ్చి నాటారు.


ఇక్కడ వరకు ప్రభుత్వ లక్ష్యం బాగానే ఉన్నా దాన్ని ఆచరణలో అధికారుల చిత్తశుద్ధి లోపించడంతో అనుకున్న లక్ష్యం నెరవేరునట్లు కనిపిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా పచ్చగా ఉన్న పల్లె ప్రకృతి వనాలు నేడు ఎండిపోయి వెలవెలబోతున్నాయి. పంచాయతీ కార్యదర్శుల అలసత్వంతో వాటిని నిర్వహణను గాలికొదిలేయడంతో నాలుగు సంవత్సరాల పాటు ఏపుగా పెరిగిన పల్లె ప్రకృతి వనాలు నేడు ఎండిపోయి జీవచ్చంలా నేలకొరిగాయి. ప్రభుత్వాలు మారడమో, అధికారుల నిర్లక్ష్యమో, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమో, తెలియదు కాని మండలంలోని అన్ని పంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాలు నేడు నిరాదరణకు గురై వెల వెల పోతున్నాయి.


మండలంలో 45 పల్లె ప్రకృతి వనాలు..

మంగపేట మండలంలోని 25 గ్రామపంచాయతీలు వాటి హాబిటేషన్ లో 45 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. అందు కోసం ఎన్ఆర్ఈజీఎస్ నుండి రూ. 52 లక్షల 64 వేలు ఖర్చు చేయగా ఇందులో కూలీల(వేజ్) కోసంరూ. 32 లక్షల 48 వేలు, రూ. 20 లక్షల 16 వేలు మెటీరియల్ కోసం ఖర్చు చేశారు. అదే కాకుండా ప్రతి పంచాయతీ నుంచి కార్యదర్శులు పల్లె ప్రకృతి వనాల్లో చుట్టూ గార్డెనింగ్ కోసం అందమైన మొక్కల కొనుగోలు కోసం 25 గ్రామ పంచాయతీల్లోరూ. 30 నుంచి 45 లక్షల వరకు నిధులు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో కొందరు కార్యదర్శులు తమ చేతివాటం ప్రదర్శించి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డట్లు ఆరోపణలు సైతం ఉన్నాయి.

ఇంత ఖర్చుచేసి నేడు ఎండగట్టారు..!

పల్లె పకృతి వనాల కోసం కోట్లు, లక్షలు ఖర్చు చేసిన ప్రభుత్వం వాటి నిర్వహణలో శ్రద్ధ పెట్టకపోవడంతో నేడు ఎండిపోయి మోడువారి పోయాయి. నాలుగు సంవత్సరాల క్రితం పచ్చగా ఉండి ప్రజలకు ఆహ్లాదాన్ని పంచిన పల్లె ప్రకృతి వనాలు నేడు ఎండిపోయి దర్శణమిస్తుండడంతో పాటు అసాంఘీక కార్యక్రమాలకు పోకిరీలకు అడ్డగా మారి పోయాయనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు మండలంలోని పల్లె ప్రకృతి వనాల దుస్థితిపై దృష్టి సారించి మండల, గ్రామ ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసి పల్లె ప్రకృతి వనాలకు గత వైభవాన్ని తేవాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story

Most Viewed