బీజేపీది అవకాశవాద రాజకీయం : రంజిత్ రెడ్డి

by Disha Web Desk 11 |
బీజేపీది అవకాశవాద రాజకీయం : రంజిత్ రెడ్డి
X

దిశ, రాజేంద్రనగర్ : బీజేపీది అవకాశవాద రాజకీయమని, ఆ పార్టీని తిప్పి కొట్టాలని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరామ చంద్ర మూర్తి నాలుగు కోట్ల మంది ఆరాధ్య దైవమని, ఒక్క బీజేపీకి మాత్రమే సొంతం కాదన్నారు. శుక్రవారం అత్తాపూర్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో చేవెళ్ల పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రిజర్వేషన్ల రద్దు కోసం బిజెపి ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీకి కేవలం మతం, కులం పేరుతో రాజకీయాలు చేయడం మాత్రమే తెలుసు అని ఆరోపించారు.

బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన కేవలం ఎన్నికల అప్పుడు మాత్రమే ప్రజల్లోకి వస్తారని, తాను ఐదేళ్లుగా జనంతో మమేకమై ఉన్నానని పేర్కొన్నారు. బిజెపి ఆలయాలు, మతం పేరుతో ఓట్లను దండుకునేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని, భవిష్యత్తును బంగారు మయంగా చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇస్తే మడమతిప్పరని తెలిపారు. ఆగస్టు 15 లోపు సీఎం రుణమాఫీ చేస్తారని, ఆయన ఇప్పటికే నాలుగు దేవుళ్లపై ఒట్టు కూడా వేశారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి జరుగుతుందని తెలిపారు. విశ్వేశ్వర్ రెడ్డి కనీసం జనాలను కూడా గుర్తుపట్టరని, ఆయన వద్దకు అపాయింట్మెంట్ లేనిదే వెళితే ఒప్పుకోరని విమర్శించారు. కాంగ్రెస్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు అంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

రంజిత్ రెడ్డి దంపతులు నాకు శ్రీరామచంద్రులతో సమానం : బండ్ల గణేష్


సమావేశానికి ముందు ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ యూత్ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. తన గుండె కాంగ్రెస్.. కాంగ్రెస్ అని కొట్టుకుంటుందని, తన రక్తంలో కాంగ్రెస్ ప్రవహిస్తుందని తెలిపారు. అయోధ్య రాముడు ఎవరి సొంతం కాదన్నారు. బిజెపి మాత్రమే గుడి కట్టించినట్లు ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. రంజిత్ రెడ్డి దంపతులు తనకు శ్రీరామచంద్రులతో సమానమని స్పష్టం చేశారు. రంజిత్ రెడ్డి ఎంతో నిజాయితీ కలిగిన వ్యక్తి అని ఆయన నిస్వార్థంగా ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన తన సొంత అన్నలాంటి వాడు అని చెప్పారు.

రంజిత్ రెడ్డి ని గెలిపించుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి, రాష్ట్ర ఇంచార్జ్ సురభి దివేది, డిసిసి ప్రెసిడెంట్ చల్లా నరసింహ రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీలు, కార్పొరేషన్ చైర్మన్లు,నేషనల్ కో,ఆర్డినేటర్,జీషన్ అహ్మద్,చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జి కృష్ణంరాజు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రవికాంత్ రెడ్డి , బడంగ్పేట్,మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, రంజిత్ రెడ్డి తనయుడు రాజా రెడ్డి,పలువురు హాజరయ్యారు.

Next Story

Most Viewed