ఈ ఎన్నికలు నిజానికి, అబద్ధానికి మధ్య జరుగుతున్న పోరు : మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి

by Disha Web Desk 15 |
ఈ ఎన్నికలు నిజానికి, అబద్ధానికి మధ్య జరుగుతున్న పోరు :  మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
X

దిశ, కొల్చారం : తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు నిజానికి, అబద్ధానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు అని మాజీ మంత్రి నర్సాపూర్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి మండల కేంద్రమైన కొల్చారంలో మండల పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీ శంకర్ గుప్తా అధ్యక్షతన జరిగిన కార్నర్ సమావేశంలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి, మాజీ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. గత ఎన్నికల్లో ఎక్కడా లేని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని విస్మరించిందన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే ధ్యేయంగా ఇష్టారీతిగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను మరిచిందన్నారు. ఎన్నికల్లో నిలబడ్డ ముగ్గురు అభ్యర్థుల్లో పనిమంతుడైన వెంకట్రామిరెడ్డిని ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుంది అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అమలు చేసిన రైతుబంధు, రైతు బీమా పథకాలను అమలు చేయకుండా రైతుల కడుపు కొడుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ అన్నారు. వరి పంటకు క్వింటాలుకు రూ.500 అదనంగా మద్దతు ధర ఇస్తామనిఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ విషయాన్ని మరిచి పోయారన్నారు. యాసంగి పంటలు ముగిసినా ఇప్పటికీ రైతుల ఖాతాలలో రైతుబంధు డబ్బులు జమ కాలేదన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేసే ప్రభుత్వం బీఆర్ఎస్ అన్నారు. ఇప్పటికైనా పనిచేసే వారికి పట్టాం కట్టాలని, పనిమంతుడైన వెంకట్రామిరెడ్డిని మెదక్ పార్లమెంట్ స్థానంలో గెలిపించి పార్లమెంటుకు పంపించాలన్నారు.

ప్రజాస్వామ్యంలో ఓటు కీలకం : శాసనసభ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమని, ఓటు వేసే సమయంలో అభ్యర్థి గుణగణాలను చూసి మంచి అభ్యర్థిని ఎన్నుకుంటే ఐదు సంవత్సరాల వరకు ప్రజా సంక్షేమం కోసం అభ్యర్థి పని చేస్తాడని తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలుచేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందన్నారు. రైతుబంధు, మద్దతు ధర, రుణమాఫీ లాంటి అంశాలను హామీలకే పరిమితం చేసిన అబద్ధపు ప్రభుత్వం కాంగ్రెస్ అన్నారు. వెంకట్రామిరెడ్డి లాంటి పనిమంతుడైన వ్యక్తిని పార్లమెంటుకు పంపితే నియోజకవర్గం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందన్నారు.

ప్రజాసేవ కోసమే వచ్చా : ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి

25 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రజలకు సేవ చేసి మరింత సేవ చేయడం కోసం మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ ఎస్ తరఫున పోటీ చేస్తున్నానని ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. రూ.100 కోట్ల ఉమ్మడి కుటుంబం నిధులతో వెంకట్రామిరెడ్డి ట్రస్టును ఏర్పాటుచేసి మెదక్ పార్లమెంటు నియోజకవర్గం ప్రజలకు సేవలందిస్తానని అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్లో ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసి నిరుపేదలకు ఉచితంగా ఫంక్షన్​హాల్లో పెళ్లి చేసుకునే అవకాశం కల్పించినట్లు, ప్రత్యేకంగా నిరుద్యోగుల కోసం కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు, నిరుద్యోగ యువకులకు ఉపాధి కోసం హైదరాబాద్​

నుండి కంపెనీలను రప్పించి వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచనున్నట్లు తెలిపారు. 25 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగిగా వివిధ స్థాయిల నుండి కలెక్టర్ వరకు పనిచేసిన అనుభవంతో నియోజక ఉద్యోగిగా వివిధ స్థాయిల నుండి కలెక్టర్ వరకు పనిచేసిన అనుభవంతో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తా అన్నారు. ఈ కార్యక్రమంలో కొల్చారం ఎంపీపీ మంజుల కాశీనాథ్, జెడ్పీటీసీ సభ్యురాలు ముత్యంగారు మేఘమాల సంతోష్, డీసీఎంఎస్

వైస్ చైర్మన్ అరిగి రమేష్, మాజీ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ తుక్కాపూర్ ఆంజనేయులు, మాజీ సీడీసీ అధ్యక్షులు నరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు యాద గౌడ్ యాదయ్య, ఉమా రాజా గౌడ్, మంజుల సత్యనారాయణ, గోదావరి మురళి, సంతోషా ఎల్లేశం, జిల్లా నాయకులు ముత్యం ప్రవీణ్ ,సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు ఉదయ వేమారెడ్డి, పోతంశెట్టిపల్లి ఎంపీటీసీ సభ్యురాలు సాయిని సిద్ధిరాములు, రంగంపేట ఎంపీటీసీ సభ్యులు మాధవి రాజా గౌడ్, పాండ్ర వెంకటేశం, సంగమేశ్వర్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed