కాంగ్రెస్ ప్రభుత్వం మాటిస్తే తప్పదు

by Disha Web Desk 15 |
కాంగ్రెస్ ప్రభుత్వం మాటిస్తే  తప్పదు
X

దిశ, అల్లాదుర్గం : కాంగ్రెస్ ప్రభుత్వం మాటిస్తే మాట తప్పక నెరవేరుస్తుందని, ఇచ్చిన వాగ్దానాలను, హామీలను తప్పక నెరవేర్చే ప్రభుత్వం కాంగ్రెస్ అని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం అల్లాదుర్గం మండలంలోని ముస్లాపూర్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన అల్లాదుర్గం, టేక్మాల్ మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటిస్తే తప్పక నెరవేరుస్తుందని, ప్రజలు, కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడవద్దని అన్నారు.

కేవలం నాలుగు నెలల్లోనే ఐదు గ్యారంటీ లను అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని, ఆగస్టు 15 లోపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు లక్షల రైతు రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేస్తారని తెలిపారు. ఆందోల్ అభివృద్ధి చేసే బాధ్యత తనదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 40 రోజుల్లోనే టేక్మాల్ మండలానికి 25 కోట్ల రూపాయలతో రోడ్ల పనులను ప్రారంభించినట్లు తెలిపారు. జోగిపేట పట్టణంలో వాణిజ్య, వ్యాపార, సంస్థలకు గాను 20 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. 12 కోట్లతో వట్టిపల్లి మండల కేంద్రానికి 100 పడకల ఆసుపత్రికి 12 కోట్లు కేటాయించినట్లు వివరించారు. పదేళ్ల కాలంలో రాయికోడు మండలం ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేకపోయిందన్నారు. యువత కోసం అల్లాదుర్గం చౌరస్తా, సంగుపేట చౌరస్తాలను ఇండస్ట్రియల్ జోన్ గా ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

దీంతో స్థానికంగా యువతీ, యువకులకు ఉద్యోగ కల్పన అవకాశాలు, ఉపాధి లభిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేయలేదని, 500 కోట్ల రూపాయల నిధులను ముందే మంజూరు చేయించి పనులను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం పెండింగ్ లో ఉన్న పనులను తప్పక నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి చేసే బాధ్యత మాది, సాధక బాధకాలలో పాలుపంచుకుంటాం అన్నారు. కార్యకర్తలు,మండల స్థాయి నాయకులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. కార్యకర్తలు, నాయకులు గ్రూప్ రాజకీయాలకు దూరంగా ఉండాలన్నారు. గ్రామాల్లోనే కాకుండా పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందన్నారు. అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్లకు వేతనం పెరుగుదలకు జాతీయస్థాయిలో వాగ్దానం చేసినట్లు ఆయన తెలిపారు. మేమంతా మీ సేవలో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రజలు సహకరించాలని కోరారు.

ఆందోల్ అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుంది : మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి

ఆందోల్ నియోజకవర్గం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందని ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ అన్నారు. ప్రతి కార్యకర్త ,నాయకులు ఇంటింటి ప్రచారం సమన్వయంతో, బాధ్యతగా నిర్వహించి ప్రజలకు పథకాలపై అవగాహన కల్పించాలని అన్నారు.

బీజేపీ ప్రభుత్వం దగా చేస్తుంది : జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు

బీజేపీ ప్రభుత్వం మతతత్వ రాజకీయం చేస్తూ ప్రజలపై దగా, మోసం చేస్తూ అన్యాయం చేస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు అన్నారు. 400 సీట్లతో రాజ్యాంగాన్ని మారుస్తామని, కూనగొడతామంటూ బీజేపీ ప్రభుత్వం అవాకులు చవాకులు పేలుస్తుందన్నారు. ప్రజలు ఓటుతో సమాధానం చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు. బీజేపీ రాముడి పేరుతో మతతత్వ రాజకీయం చేస్తుందని ఆరోపించారు. రాజకీయాలకు రాముడికి ఎలాంటి సంబంధం లేదని కేవలం దేవుళ్లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అనంతరం ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీలో చేరికలు..

అల్లాదుర్గం మండలంలోని ముప్పారం, రెడ్డిపల్లి గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నుండి సుమారు 200 మంది మంత్రి సమక్షంలో చేరారు. ముప్పారం గ్రామ బీఆర్ఎస్ పార్టీ ఉప సర్పంచ్ యాదుల్ తో సహా సుమారు 200 మంది మైనారిటీ సోదరులందరూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి దామోదర రాజనర్సింహ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు విష్ణు నాథ్, అల్లాదుర్గం టేక్మాల్ మండల అధ్యక్షులు శేషారెడ్డి, నిమ్మ రమేష్, పార్టీ సీనియర్ నాయకులు సుభాష్ రావు, నరసింహారెడ్డి , ఎస్సీ, ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు బలరాం, మైనార్టీ సెల్ మండల ఉపాధ్యక్షుడు శుకూర్ భాయ్, టేక్మాల్, అల్లాదుర్గం, మండలాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed