రేవంత్ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం

by Disha Web Desk 15 |
రేవంత్ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం
X

దిశ, పటాన్ చెరు : సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట మీటింగ్ లో తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇది బాధాకరమని ఆయన అహంకారానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనమని బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి అన్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచారం నిమిత్తం బీఆర్ఎస్ శ్రేణులతో జీఎంఆర్ కన్వెన్షన్ హాల్ లో నిర్వహించిన సమావేశంలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట సభలో ముఖ్యమంత్రి తనపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. సీఎం కుర్చీలో హుందాగా ఉండాల్సింది పోయి, అందుకు విరుద్ధంగా రేవంత్ రెడ్డి వింతగా ప్రవర్తించి ముఖ్యమంత్రి సీటుకు ఉన్న గౌరవాన్ని దిగజారుస్తున్నారని ఆరోపించారు. తాను ప్రభుత్వ అధికారిగా, కలెక్టర్ గా 25 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు ఐదుగురు ముఖ్యమంత్రిల వద్ద పని చేశానని, కానీ ఏ ఒక్కరూ ఇలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడలేదన్నారు.

ప్రభుత్వ అధికారిగా తాను పనిచేసిన ప్రాంత అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేశానని తెలిపారు. మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ లు దేశంలోనే గొప్ప ప్రాజెక్టులన్నారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో బాధితులకు దేశంలో ఎక్కడాలేని విధంగా సహాయం అందించామన్నారు. బాధితులకు తగిన నష్టపరిహారం అందించడంతో పాటు ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజలకు కావలసిన అన్ని పరిహారాలను సక్రమంగా అందించం కాబట్టి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ముంపు బాధితులు బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ కట్టబెట్టిన విషయాన్ని సీఎం రేవంత్ గుర్తు పెట్టుకోవాలన్నారు. మెదక్ ప్రజలు చైతన్యవంతులని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించిన ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు మళ్లీ అవే ఫలితాలు పునరావృతం చేస్తూ కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్తారని ఆయన జోష్యం చెప్పారు.

అధికారిగా తమ ఆప్తుడిగా నేనేంటో ఈ ప్రాంత ప్రజలకు తెలుసని, తనను ఎంత విమర్శిస్తే అంత ఎక్కువ ఓట్లు తనకే పడతాయని ధీమా వ్యక్తం చేశారు. విజ్ఞులైన మెదక్ పార్లమెంట్ ఓటర్లు అభ్యర్థుల గుణగణాలు ఆలోచించి ఓటు వేయాలని, గోబెల్స్ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్,బీజేపీ పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో చేసిన మోసాలను ప్రజలందరూ గుర్తించారని తెలిపారు. పటాన్ చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పటాన్చెరు నుంచి 50 వేలకు పైగా మెజారిటీ అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Next Story

Most Viewed