కంటోన్మెంట్ కమలంలో డైలమా.. BJP క్యాండిడేట్ తీరుతో అసహనం

by Disha Web Desk 4 |
కంటోన్మెంట్ కమలంలో డైలమా.. BJP క్యాండిడేట్ తీరుతో అసహనం
X

దిశ, కంటోన్మెంట్: ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు దూసుకువెళ్తుంటే.. కంటోన్మెంట్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి మాత్రం వెనుకంజలో ఉన్నారు. పోలింగ్ దగ్గర పడుతున్నా.. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంశ తిలక్ ఎన్నికల ప్రచారంలో చతికిల పడుతున్నట్లు కనిపిస్తోంది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతల నుంచి సహకారం కొరవడడంతో పాటు ఓటమిని ముందుగానే ఊహించి ప్రచారం చేయడం లేదని ప్రత్యర్థి వర్గాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఫలితంగా క్యాడర్‌లోనూ నిస్తేజం అవహించి ప్రచార సందడి కరువైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు బీజేపీ పోటీ ఇవ్వడం సంగతి పక్కన పెడితే.. కనీసం ప్రచారం కూడా చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఈటలపై ప్రభావం..

దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ హవా నడుస్తోంది. మల్కాజ్‌గిరి లోక్‌సభ పరిధిలో ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ కంటే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే కంటోన్మెంట్ ఉప ఎన్నిక ప్రభావం ఈటల రాజేందర్‌పై పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి వంశ తిలక్ ఎన్నికల ప్రచారంలో నెమ్మదిస్తుండడంతో ఈటల రాజేందర్‌కు మెజార్టీ తగ్గే అవకాశాలు ఉన్నట్లు వారు అంచనా వేస్తున్నారు. కంటోన్మెంట్ ఉపఎన్నిక బీజేపీ అభ్య ర్థి ఎన్నికల క్యాంపెయిన్‌లో స్పీడ్ పెంచి ఉంటే మరింత లాభం ఉండేదంటున్నారు. ఇప్పటికే పార్టీ అంతర్గత సమావేశాల్లో కంటోన్మెంట్ అభ్యర్థి వంశ తిలక్ ఎన్నికల ప్రచార తీరు, ఇతర నేతలను కలుపుకోని పోవడంపై చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే తాను ప్రచారంలో దూకుడు పెంచుతానని, అందరినీ కలుపుకొని వెళ్తానని ఆయా సమావేశాల్లో హామీ ఇచ్చినట్లు తెలిసింది. సమావేశాలలో పార్టీ అధి నాయకుల ఆదేశాలను పాటిస్తానని చెబుతున్నా.. క్షేత్ర స్థాయి అమలు చేయడంలో విఫలమవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కమలంలో నిస్తేజం

పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. కానీ కంటోన్మెంట్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల కంటే బీజేపీ అభ్యర్థి ప్రచారంలో వెనుకంజలోనే ఉంది. ఎన్నికల ప్రచారాన్ని భుజాన వేసుకోవాల్సిన కొందరు నేతలు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జాతీయ స్థాయి నేతలు మాత్రమే అప్పుడప్పుడు ప్రచారం చేసి వెళ్లుతున్నారు. వారు కూడా మల్కాజ్‌గిరి పార్ల మెంట్ గురించే మాట్లాడుతున్నారు తప్ప.. కంటోన్మెంట్ ప్రస్తావనం తీయకపోవడం బీజేపీ శ్రేణుల్లో ఒకింత అసహనం నెలకొంది. అసలు కంటోన్మెంట్ బరిలో ఉన్నామా.. అంటే ఉన్నాం! అన్నట్లుగా వ్యవహరిస్తున్నారే తప్ప అభ్యర్థి వంశ తిలక్‌లో సీరియస్ నెస్ కనిపించడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకపోతే కంటోన్మెంట్‌లోని కొందరు కీలక నేతలు క్షేత్ర స్థాయిలో ప్రచారం చేయడంలేదు. అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నాలను కాషాయ పార్టీ చేయకపోవడంతో నేటికి నేతలు ఎవరికి వారే! అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రచార సందడి లేక క్యాడర్‌లోనూ నిస్తేజం అలుముకోవడంతో నేతలపై శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

Next Story

Most Viewed