ప్రెగ్నెంట్ అయితే ముసలోళ్లు అయినట్లే.. రీసెంట్ స్టడీలో విస్తుపోయే నిజాలు

by Dishafeatures2 |
ప్రెగ్నెంట్ అయితే ముసలోళ్లు అయినట్లే.. రీసెంట్ స్టడీలో విస్తుపోయే నిజాలు
X

దిశ, ఫీచర్స్ : గర్భధారణ ప్రతీ స్త్రీ జీవితంలో, ఆమె కుటుంబంలో అత్యంత సంతోషకరమైన సందర్భంగా పేర్కొంటారు. ప్రెగ్నెన్సీలో పలు ఆరోగ్య సమస్యలు ఎదరైనా సంతానం కలుగుతుందనే ఆనందంలో వాటిని భరిస్తుంటారు మహిళలు. అయితే గర్భధారణ సమయంలో పలు శారీరక, మానసిక సమస్యలను, మార్పులను కూడా అనుభవిస్తుంటారు. ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో పబ్లిషైన ఒక స్టడీ ప్రకారం.. గర్భం దాల్చిన స్త్రీలలో మిగతా స్త్రీలతో వృద్ధాప్య ఛాయలు లేదా సంకేతాలు ఎక్కువగా కనిపస్తాయి. మరో విషయం ఏంటంటే.. ఒక మహిళ ఒకటికంటే ఎక్కువసార్లు గర్భం ధరించినట్లయితే ఆమెలో జీవ సంబంధమైన వృద్ధాప్య ప్రక్రియ వేగవంతం అవుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

‘‘గర్భధారణ శరీరంపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతుందని మేం తెలుసుకున్నాం.. అయితే ఇదేం చెడ్డ విషయం కాదు. కానీ వ్యాధుల ప్రమాదాన్ని, కొన్నిసార్లు అకాల మరణాలను పెంచుతుంది’’ అని పరిశోధనకు నాయకత్వం వహించిన మెయిల్ మాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌‌లోని కొలంబియా యూనివర్సిటీ ఏజింగ్ సెంటర్‌కు చెందిన సైంటిస్ట్ కాలెన్ ర్యాన్ తెలిపారు. అధ్యయనంలో భాగంగా పరిశోధకులు ఫిలిప్పీన్స్‌లోని1,735 మంది వ్యక్తులకు సంబంధించిన బ్లడ్ శాంపుల్స్‌ను పరిశోధకులు విశ్లేషించారు. వీరంతా 2005లో 20 నుంచి 22 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్నవారే. దీంతోపాటు సెబు లాంగిట్యూడినల్ హెల్త్ అండ్ న్యూట్రిషనల్ సర్వే నుంచి కూడా రీసెర్చర్స్ డేటాను సేకరించి ఎనలైజ్ చేశారు.

అదనంగా పరిశోధకులు స్త్రీ, పురుషుల్లో వృద్ధాప్య ప్రక్రియను ప్రభావితం చేసే సోషియో ఎకానమిక్, అలాగే పొల్యూషన్ రిలేటెడ్ వేరియబుల్స్‌ను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. మహిళల్లో గర్భధారణ చరిత్రతోపాటు వారి పునరుత్పత్తి, లైంగిక నేపథ్యాలను విశ్లేషించారు. అయితే గర్భధారణ సమయంలో శారీరక, మానసిక ఒత్తిడిని కలిగించే ‘ఎపిజెనెటిక్ క్లాక్స్’ కణాల్లో మార్పులు గర్భం దాల్చని స్త్రీలకంటే ఎక్కువగా వేగవంతమైన జీవపరమైన వృద్ధాప్య సంకేతాలను ప్రదర్శించాయని మిగతా స్త్రీలతో పోల్చితే ఇవి సుమారు 3 శాతం వృద్ధాప్యాన్ని పెంచాయని కనుగొన్నారు. ఈ ప్రక్రియ కారణంగా జీవసంబంధమైన వయస్సులో నాలుగు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు వృద్ధాప్య ఛాయల పక్రియ కొనసాగుతుందని, ఆ తర్వాత సాధారణంగానే మారుతుందని పరిశోధకులు అంటున్నారు. ఇక ఎక్కువసార్లు గర్భం ధరించే స్త్రీలలో ప్రతి గర్భధారణ సమయంలో 2 శాతం వృద్ధాప్య జీవక్రియలు పెరుగుతాయని చెప్తున్నారు. అయినప్పటికీ ఏజ్ రివర్సల్ అనే కాన్సెప్ట్ వింతగా ఉందని రీసెర్చర్స్ పేర్కొంటున్నారు.



Next Story

Most Viewed