పూతలపట్టులో అవినీతి రచ్చ.. ప్రచారంలో అభ్యర్థులను ఎక్కడిక్కకడ నిలదీస్తోన్న ఓటర్లు..!

by Disha Web Desk 19 |
పూతలపట్టులో అవినీతి రచ్చ.. ప్రచారంలో అభ్యర్థులను ఎక్కడిక్కకడ నిలదీస్తోన్న ఓటర్లు..!
X

దిశ ప్రతినిధి, చిత్తూరు: పూతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంఎస్ బాబును అవినీతి ఆరోపణలు చుట్టుముట్టి ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రెండేళ్ల కిందట అంటుకున్న అవినీతి మరకలు ఈ ఎన్నికల సందర్భంగా ఆయన చుట్టూ బాంబుల్లా పేలుతున్నాయి. నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే హోదాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎక్కడికి వెళ్లిన ఆయన బాధితులు నేటికీ వెంటాడుతూనే ఉన్నారు. ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన ప్రతిచోట ఆయన బాధితులు అడ్డగిస్తూ పగలే చుక్కలు చూపిస్తున్నారు.

దాంతో ఎమ్మెస్ బాబుకు దిక్కు తోచడం లేదు. అయితే ఈయన పాపం అధికార పార్టీ అభ్యర్థికి కూడా తగిలే పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే బాబును చుట్టుముట్టిన అవినీతి ఆరోపణల సెగ అధికార పార్టీ అభ్యర్థి అయిన సునీల్ కుమార్‌కు కూడా తగలక తప్పేటట్లు లేదు. దాంతో వైసీపీ అభ్యర్థిగా సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారంలో అక్కడక్కడ ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు.

మద్యం డిపోలో ఉద్యోగాల పేరుతో..

పూతలపట్టు మండలంలోని వడ్డేపల్లి సమీపానగల జిల్లా మద్యం డిపోలో ఉద్యోగాల పేరుతో దళారులు ప్రజాప్రతినిధుల పేరు చెప్పి కోట్లు దండుకున్నారు. అవినీతి ఆరోపణలు జిల్లాలో గత రెండేళ్లుగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎమ్మెల్యేకి సన్నిహితంగా ఉండే కొందరు స్థానికులు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి రూ. 10 నుంచి 20 లక్షల వరకు తీసుకున్నారు. ఈ మద్యం డిపోలోనే సుమారు 20 ఉద్యోగాల కోసం 150 నుంచి 200 మంది వరకు డబ్బులు ఇచ్చిన బాధితులు ఉన్నారు.

ఈ విషయం అప్పట్లోనే పత్రికలు, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉద్యోగాల భక్తి ప్రక్రియను అధికారులు ఆపేశారు. దాంతో కోట్లాది రూపాయలు దళారులు, మధ్యవర్తుల చేతుల్లోనే ఆగిపోయింది. దీనిపై పూతలపట్టు పోలీస్ స్టేషన్‌లో బాధితులు పలుమార్లు ఫిర్యాదులు కూడా చేశారు. అయితే ఒకరిద్దరు దళారులపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క బాధితులకు కూడా ఇటు ఉద్యోగం రాక అటు ఇచ్చిన డబ్బులు వెనక్కి రాక ఆందోళన చెందుతున్నారు.

షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టుల్లోనూ భారీ అవినీతే..

పూతలపట్టు నియోజకవర్గం పరిధిలోని ట్రాన్స్ కో సబ్ స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ల ఉద్యోగాల భర్తీ పేరుతో మరో భారీ అవినీతి చోటు చేసుకుంది. ఈ అవినీతి అక్రమాలు జరిగి కూడా సుమారు ఏడాదిన్నర కాలం గడుస్తోంది. ఈ విషయం కూడా అప్పటి నుంచి నేటి వరకు నియోజకవర్గంలో రచ్చ రచ్చ అవుతోంది. నియోజకవర్గ పరిధిలో 25 నుంచి 30 వరకు విద్యుత్ సబ్ స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో షిఫ్ట్ ఆపరేటర్ల ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ఏడాదిన్నర క్రితం ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీన్ని పసిగట్టిన ఎమ్మెల్యే అనుచరులు దళారుల అవతారం ఎత్తి ఒక్కో ఉద్యోగానికి రూ .10 నుంచి 15 లక్షల వరకు దండుకున్నారు.

అయితే ఈ విషయంలో కూడా పత్రికలు ఘోషించడంతో నియామకాలు ఆగిపోయాయి. తీసుకున్న డబ్బులు మాత్రం ఏ ఒక్కరికి ఇప్పటివరకు ఇవ్వలేదు. ముఖ్యంగా పూతలపట్టు మండలానికి చెందిన ఎం బండపల్లి, వేపనపల్లి, పూతలపట్టు, వడ్డేపల్లి గ్రామాలకు చెందిన బాధితుల నుంచే కాకుండా ఐరాల, తవణంపల్లి, బంగారుపాలెం మండలాల్లో కూడా ఈ ఉద్యోగాల పేరు చెప్పి భారీగా వసూలు చేసినట్లు నిరూపణ కూడా అయింది.

అభ్యర్థులను అడ్డగిస్తున్న బాధితులు..

ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పటి ఎమ్మెల్యే ఇప్పటి కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెస్ బాబుతో పాటు వైసీపీ అభ్యర్థి సునీల్ కుమార్ నిర్వహించే ఎన్నికల ప్రచారాన్ని బాధితులు ఉండే గ్రామాల్లో అడ్డుపడుతున్నారు. దీనిలో భాగంగానే ఇటీవల వేపనపల్లెకు వెళ్లిన వైసీపీ అభ్యర్థి సునీల్ కుమార్‌పై వేపనపల్లి యువకులు అడ్డుపడుతూ తిరుగుబాటు చేశారు. ఇదే పరిస్థితి బాధితులు ఉండే గ్రామాల్లో అప్పుడప్పుడు జరుగుతూనే ఉంది.

అయితే నిన్నటి రోజు వైసీపీ అభ్యర్థి సునీల్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎంఎస్ బాబును చుట్టుముట్టిన అవినీతి ఆరోపణలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బాబు అవినీతి ఆరోపణలు నిరూపణ కావడంతోనే పార్టీ అధిష్టానం కూడా ఈసారి ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టిందని విషయాన్ని వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో అభ్యర్థులు ఇద్దరికీ గ్రామాల్లో బాధితుల సెగ తగులుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో వీరిద్దరూ బాధితుల ఆందోళనను ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాల్సి ఉంది.

Next Story