జులై చివరిలో 12ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్..!

by  |
Corona Vaccination
X

న్యూఢిల్లీ: టీకా పంపిణీపై కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. వచ్చే నెల చివరలో 12 ఏళ్ల నుంచి 18ఏళ్ల పిల్లలకు టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని కొవిడ్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఎన్‌కే అరోరా ఆదివారం వెల్లడించారు. జైదుస్ కాడిలా టీకా ట్రయల్స్ దాదాపు పూర్తయ్యాయని వివరించారు. ట్రయల్స్ ఫలితాల వివరాల సమర్పణ, పరిశీలన, అనుమతి ప్రక్రియనే తరువాయి అని తెలిపారు. ఈ టీకాకు త్వరలోనే అనుమతి లభిస్తే జులై చివరిలో లేదా ఆగస్టులో 12ఏళ్లు పైబడిన పిల్లలకు పంపిణీ చేయడం సాధ్యమవుతుందని వివరించారు. థర్డ్ వేవ్ ఆలస్యంగా వచ్చే అవకాశముందని ఐసీఎంఆర్ అధ్యయనం చెబుతున్నదని అన్నారు. ఫలితంగా ప్రతి పౌరుడిలో ఇమ్యూనిటీ పెంచడానికి 6 నుంచి 8 నెలల కాలం అందుబాటులో ఉన్నదని పేర్కొన్నారు. టీకా పంపిణీ వేగాన్ని మరింత పెంచనున్నట్టు చెప్పారు. సమీప భవిష్యత్‌లో రోజుకు కోటి డోసుల పంపిణీ టార్గెట్‌గా పెట్టుకుంటున్నామని వివరించారు.

థర్డ్ వేవ్‌కు మూడు అంశాలు కీలకం

సెకండ్ వేవ్ వెనక్కితగ్గినా డెల్టా ప్లస్ వేరియంట్ కలవరం కలిగిస్తున్నది. థర్డ్ వేవ్‌కు డెల్టా ప్లస్ కారణమయ్యే అవకాశముందని ఇప్పుడే చెప్పలేమని, అలాగే కొట్టిపారేయనూ లేమని డాక్టర్ ఎన్‌కే అరోరా అభిప్రాయపడ్డారు. కానీ, థర్డ్ వేవ్ మూడు అంశాలపై ఆధారపడి ఉంటుందని అన్నారు. సెకండ్ వేవ్‌లో ఎంతమొత్తంలో జనాభా ఇన్ఫెక్ట్ అయ్యారనే విషయం కీలకం కానుందని, వీరంతా థర్డ్ వేవ్‌ సమయంలో జలుబు వచ్చినప్పుడు వచ్చే జ్వరం స్థాయి అనారోగ్యంతో బయటపడతారని తెలిపారు. ఎంత మందికి టీకా వేశామనేదీ ప్రధాన భూమికను పోషిస్తుందని వివరించారు. థర్డ్ వేవ్ వచ్చేనాటికి వారంతా ఇమ్యూనిటీతో ఉంటారని పేర్కొన్నారు. మూడోది, కొవిడ్ ప్రొటోకాల్స్ పాలన అని తెలిపారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలతో ఎంతటి వేరియంట్‌ నుంచి అయినా రక్షణ పొందవచ్చునని వివరించారు.

Next Story

Most Viewed