నేడు జెడ్పీ మీటింగ్​

by  |
నేడు జెడ్పీ మీటింగ్​
X

దిశ, కామారెడ్డి: ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించే జిల్లా పరిషత్ సాధారణ సమావేశం నేడు జిల్లా కేంద్రంలోని వెలమ ఫంక్షన్ హాల్​లో జరుగనుంది. జిల్లా పరిషత్ చైర్మన్ దఫిదార్ శోభ అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్​ జిల్లాలోని ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజాల సురేందర్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పేరుకుపోయిన సమస్యలపై ప్రజాప్రతినిధులు ప్రశ్నలు లేవనెత్తె అవకాశాలు ఉన్నాయి.

పూర్తికాని మిషన్ భగీరథ పనులు

మిషన్ భగీరథ పనులు జిల్లాలో పూర్తి స్థాయిలో కాలేదు. ఈ విషయమై మొదటి సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు అధికారులను నిలదీయగా నెల రోజుల్లో వందశాతం పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అయినా ఇప్పటి వరకు గ్రామాల్లో పనులు ఎక్కడా పూర్తి కాలేదు. కాళేశ్వరం పనులు పూర్తయితే కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో సుమారు రెండు లక్షల ఎకరాలకు సాగునీరందే అవకాశాలు ఉన్నాయి. పనులు మాత్రం ఇప్పటికీ ఇంకా పూర్తి కాలేదు.

పింఛన్లు, రేషన్ కార్డుల కోసం ఎదురుచూపు

రెండేళ్లుగా కొత్తగా ఆసరా పింఛన్లు లేక ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వేలాది మంది పింఛన్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. కొత్త పింఛన్లపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్న హామీ పెండింగ్​లోనే ఉంది. ఇప్పటికే జిల్లాలో 2.28 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో పేర్లు నమోదు కానీ వాళ్లు చాలా మంది ఉన్నారు. కొత్తగా పెళ్లిళ్లు అయిన వారు, వేరుగా ఉంటున్నవారు రేషన్ కార్డుల కోసం పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం చెప్పినప్పుడల్లా ప్రజలు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీసేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేపట్టినా రెండేళ్లుగా కొత్త రేషన్ కార్డులు రాలేదు.

మినీ ట్యాంక్​బండ్​లు.. రహదారుల సమస్య..

జిల్లాలోని చాలా గ్రామాల్లో రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉంది. కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాలకు చాలా గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు దెబ్బతిన్నాయి. రహదారుల మరమ్మతుల కోసం ప్రజాప్రతినిధులను గ్రామాల్లోకి వెళ్లినప్పడు నిలదీస్తున్నారు. జిల్లాలో ఆరు మినీ ట్యాంక్ బండ్ నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. ట్యాంక్ బండ్ పనుల్లో ఇప్పటికీ పురోగతి లేదు.

అటవీ భూముల వివాదం

ముఖ్యంగా అటవీశాఖ అధికారుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన భూములను అధికారులు లాక్కుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని గ్రామాల్లో అధికారుల ఇబ్బందుల పెట్టడం వల్ల పంటలు వేసుకోలేక పోయామని రైతులు వాపోతున్నారు. ఈ అంశంపై ప్రజాప్రతినిధులు అధికారులను నిలదీసే అవకాశాలు ఉన్నాయి.

కొనుగోలు కేంద్రాలపై స్పష్టత కరువు

ఇటీవల ప్రభుత్వం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసింది. ప్రస్తుతం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఎత్తేయడం ద్వారా వచ్చే సీజన్​లో రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురుకానున్నాయి. కొనుగోలు కేంద్రాలు పూర్తిగా ఎత్తివేస్తారా..? లేక తాత్కాలికంగా ఆ అంశాన్ని పక్కన పెట్టారా అనేదానిపై ఎవ్వరికీ స్పష్టత లేదు. జిల్లాలో మొక్కజొన్న పూర్తి స్థాయిలో కొనుగోళ్లు జరగలేదు. ఆన్​లైన్​లో పేర్లు నమోదు కాకపోవడంతో చాలా మంది రైతుల వద్ద మొక్కజొన్న నిల్వ ఉంది. దాంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇంకా అనేక అంశాలపై సమావేశంలో వాడివేడిగా చర్చ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు లెవనెత్తే ప్రశ్నలకు అధికారుల నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయో వేచి చూడాలి మరి.

Next Story