హుజూరాబాద్‌లో బెడిసికొట్టిన షర్మిల వ్యూహం

by  |
హుజూరాబాద్‌లో బెడిసికొట్టిన షర్మిల వ్యూహం
X

దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ వ్యూహం బెడిసికొట్టింది. ఈ బైపోల్ లో నిరుద్యోగులు, ఇండిపెండెంట్లు, యువకులకు పూర్తి మద్దతు తెలిపి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని చూసిన పార్టీ శ్రేణులకు చుక్కెదురైంది. ఈ ఉప ఎన్నికల్లో ప్రత్యక్షంగా తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపకున్నా.. నిరుద్యోగులు, యువకులు, ఇండిపెండెంట్లను బరిలో నిలిపి ప్రభుత్వానికి తామేంటో నిరూపించుకోవాలని షర్మిల భావించారు. కనీసం 200 మంది నిరుద్యోగులను బైపోల్ బరిలో దింపాలని ఆ పార్టీ అధినేత్రి షర్మిల ప్రణాళికలు వేసినప్పటికీ.. ఒక్కరంటే ఒక్కరు కూడా నామినేషన్ దాఖలు చేయకపోవడం గమనార్హం. అయితే నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతున్న పార్టీనే యువకులు పట్టించుకోకుంటే తెలంగాణలో పార్టీ బలోపేతం ఎలా జరుగుతుందనే చర్చ కొనసాగుతోంది.

నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడకుండా వారిలో భరోసా కల్పించేందుకు షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేపడుతున్నారు. అమరుల కుటుంబాలను పరామర్శిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. వారికోసం షర్మిల ఎంత పోరాడినా నిరుద్యోగులు మాత్రం ఆమెకు తమ మద్దతునివ్వడం లేదని దీని ద్వారా తేటతెల్లమైంది. బైపోల్ కు ముందు తమ మార్క్ ఏంటో చూపిస్తామంటూ షర్మిల పలు ప్రసంగాల్లో వెల్లడించారు. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు షర్మిల ఓపెన్ ఆఫర్ కూడా చేశారు. ఎవరు పాల్గొన్నా అభ్యర్థులకు అన్నివిధాలా అండగా తమ పార్టీ ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఇందుకు తమ పార్టీకి చెందిన నేతకు హుజురాబాద్ ఉప ఎన్నికలకు కోఆర్డినేటర్‌గా బాధ్యతలు కూడా అప్పగించారు.

హుజురాబాద్ ఉపఎన్నికల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం నాటికి ముగిసింది. అయినా ఇప్పటి వరకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థి ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న పార్టీకి నిరుద్యోగులు సహకరించకపోవడంతో పార్టీ శ్రేణుల్లో చర్చలు మొదలయ్యాయి. వారి మద్దతే లభించకుంటే రాష్ట్రంలో పార్టీ ఎలా బలోపేతమవుతుందనే ఆలోచనలో కొందరు నేతలుపడ్డారు.

ఇదిలా ఉండగా వైఎస్ షర్మిల హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటున్నారని ఇటీవల చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎన్నో నిబంధనలను సాకుగా చూపుతూ అడ్డంకులు సృష్టిస్తున్న రిటర్నింగ్ అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అయినా నామినేషన్ల ప్రక్రియ ముగిసే చివరిరోజు నాటికి కూడా నిరుద్యోగులు నామినేషన్ దాఖలు చేయకపోవడం గమనార్హం.

హుజురాబాద్ నియోజకవర్గానికి చెందని వ్యక్తులు అక్కడ పోటీకి దిగాలంటే ఆర్డీవో వద్ద డిక్లరేషన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియకు ప్రభుత్వం నుంచి అడ్డంకులు ఏర్పడినట్లు వైఎస్సార్ తెలంగాణ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎంతోమంది అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు వచ్చినా ఎక్కడా లేని నిబంధనలను సాకుగా చూపడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా అభ్యర్థులను అరెస్టులు చేయిస్తున్నారని, వారికి మద్దతునిచ్చే వ్యక్తులకు కూడా ఇబ్బందులు సృష్టిస్తున్నారని వైఎస్సార్టీపీ నేతలు వెల్లడిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఉప ఎన్నికల్లో షర్మిల తమ మార్క్ చూపించడంలో విఫలమయ్యారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది


Next Story

Most Viewed