వైఎస్ఆర్ వాహనమిత్ర ఆర్థిక సాయం విడుదల

by  |
వైఎస్ఆర్ వాహనమిత్ర ఆర్థిక సాయం విడుదల
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో వాహనదారులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ వాహన మిత్ర పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ పథకం అమలులో భాగంగా మూడో ఏడాది ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించారు. ఆన్‌లైన్ ద్వారా లబ్ధిదారుల అకౌంట్లోకి నగదు జమ చేశారు. ఈ ఏడాది 2.48 లక్షల మంది ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ డ్రైవర్లకు రూ.10వేల చొప్పన నగదు విడుదల చేశారు. దీని కోసం రూ.248.47 కోట్ల నిధులు కేటాయించినట్లు సీఎం జగన్ తెలిపారు. ఈ పథకం ద్వారా 84%పేద వర్గాల ప్రజలు లబ్ధి పొందుతుండటం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు భరోసా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్‌ వాహనమిత్ర’ పథకం కింద ఆర్థిక సహాయం అందజేస్తోందని తెలిపారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లను ఆదుకుంది దేశంలో ఏపీ ఒక్కటేనని చెప్పుకొచ్చారు. కరోనా కష్టకాలంలో ఆర్ధిక సాయం ఎంతో మేలు చేస్తుందని, వాహన బీమాతో పాటు ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌, రిపేర్లకు రూ.10వేలు ఇస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.


Next Story