తిరుపతి లోక్‌సభకు ఉపఎన్నిక.. వైసీపీ అభ్యర్థి ఖరారు

by  |
gurumurthy
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. తాజాగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ సైతం తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. డా. గురుమూర్తిని వైసీపీ అభ్యర్థిగా సీఎం జగన్ ఖరారు చేశారు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక బరిలో వైసీపీ అభ్యర్థిగా గురుమూర్తి ఉంటారని పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మరోవైపు డా. గురుమూర్తిని పార్టీ అధిష్ఠానం అభ్యర్థిగా నిర్ణయించినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం ప్రకటించారు.

తిరుపతి ఎంపీగా ఉన్న బల్లి దుర్గాప్రసాద్‌ అనారోగ్యంతో మృతిచెందిన నేపథ్యంలో ఉప ఎన్నిక జరుగుతోంది. ఆయన తనయుడు బల్లి కల్యాణ చక్రవర్తికి ఎమ్మెల్సీగా అవకాశమిచ్చిన నేపథ్యంలో డాక్టర్‌ గురుమూర్తిని లోక్‌సభ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది. తిరుపతి ఉప ఎన్నికలో కూడా చరిత్ర సృష్టిస్తామని .. 3 లక్షల వరకు మెజారిటీ సాధిస్తామన్న నమ్మకం ఉందని మంత్రి పెద్దిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతి లోక్‌సభ పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ భారీగా గెలిచామని.. లోక్ సభ ఎన్నికల్లో కూడా అవే ఫలితాలు రిపీట్ అవుతాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దీమా వ్యక్తం చేశారు.

Next Story