కొలువుల కోసం తెచ్చుకున్న తెలంగాణలో కొలువులేవి…?

by  |
కొలువుల కోసం తెచ్చుకున్న తెలంగాణలో కొలువులేవి…?
X

దిశ, వేములవాడ: కొలువుల కోసం తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల కోసం నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్ల శివారులోని గొల్లపల్లెలో మంగళవారం షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఉద్యోగం రాలేదన్న మానసిక వేదనతో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన ముచ్చర్ల మహేందర్‌ యాదవ్‌ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. అనంతరం నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ…108, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లాంటి ఎన్నో పథకాలను వైఎస్సార్‌ నాడు ప్రవేశపెట్టారన్నారు. నేడు తెలంగాణలో ఎవరిని కదిలించినా అప్పులేనని, తెలంగాణలో ప్రతి కుటుంబం అప్పులపాలైందని విమర్శించారు. ఇళ్లు కట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా అప్పు చేయాల్సిన పరిస్థితి ఉందని షర్మిల ధ్వజమెత్తారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి మాట తప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశారని వైఎస్ షర్మిల ఆరోపించారు. కనీసం వారికి ఇస్తానన్న 3,116 నిరుద్యోగ భృతి ఏమైందని ఆమె ప్రశ్నించారు.

రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల్లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దేశంలోనే నిరుద్యోగ సమస్య అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని 54 లక్షల మంది టీఎస్సీఎస్సీ ద్వారా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆమె గుర్తు చేశారు. పీఆర్సీ ప్రకారం రాష్ట్రంలో లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, కొత్తగా ఏర్పడిన జిల్లాల సిబ్బందిని కలుపుకుని 3 లక్షల 85వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసే వరకూ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఏడేళ్ల నుంచి ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు లేక వయో పరిమితి కోల్పోయిన వేలాది మంది నిరుద్యోగులకు వయో పరిమితి పెంచాలని షర్మిల డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు, యువత ధైర్యం కోల్పోవద్దని త్వరలోనే మంచి రోజులు వస్తాయని అన్నారు. రెండేళ్ల తర్వాత కేసీఆర్ ప్రభుత్వం పోయి వైఎస్ఆర్ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు.

కేసీఆర్ రైతులకు లక్ష వరకు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారని ఫైరయ్యారు. 25 వేల లోపు లోన్లు ఉన్న లక్షన్నర మందికి మాత్రమే రుణమాఫీ చేసి, చేతులు దులుపుకున్నారన్నారు. 39 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారని.. రుణమాఫీ కాకపోవడంతో కొత్తగా లోన్లు కూడా ఇవ్వడం లేదన్నారు. బయట ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారని, 15 లక్షల మంది పెన్షన్ కావాలని దరఖాస్తు చేసుకుంటే.. అవి ఇవ్వకపోగా 2 లక్షల మంది పాత పెన్షనర్లను తొలగించారన్నారు. 15 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. వైఎస్ఆర్ మాదిరిగా పూర్తిగా రీయింబర్స్‌మెంట్ ఇప్పుడు ఇవ్వడం లేదన్నారు. 35 వేలు ఇచ్చి సరిపెట్టుకుంటున్నారని తెలిపారు.

కేసీఆర్ కొడుకు అంటే కేటీఆర్ కి ఎందుకు నామోషీ…

కేసీఆర్ కొడుకు అంటే కేటీఆర్ కి ఎందుకు అంత నామోషీ అని ప్రశ్నించారు. మరి ఏమని పిలవాలో వాళ్లే చెప్పాలని షర్మిల అడిగారు. అమెరికా నుంచి తీసుకొచ్చి, మొదటిసారి గెలిస్తే రెండు శాఖలకు మంత్రిని చేశారని, ఆయనకు ఏ అర్హత ఉందని మంత్రి పదవులిచ్చారు? కొడుకు అనే కదా ఇచ్చింది? ఉన్నమాటంటే ఉలుకెందుకు? అని షర్మిల విరుచుకుపడ్డారు. చిన్న దొర జిల్లాకి వస్తున్నాడంటే రెండు రోజుల ముందే ప్రతిపక్ష నాయకులను, జర్నలిస్టులను నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు. అదేమిటని ప్రశ్నిస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నారన్నారు. నెరేళ్లలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని అడిగితే థర్డ్ డిగ్రీ ప్రయోగం చేశారన్నారు. పాలకులకు దళితులపై ఉన్న ప్రేమ ఇదేనా? అని ప్రశ్నించారు. రాష్ట్రం మొత్తం గుట్కా నిషేధం కానీ ఇక్కడ మాత్రం గుట్కా వ్యాపారం యేథేచ్చగా నడుస్తోందని.. దానికి పోలీసుల మద్దతు ఉందన్నారు. లంచాలు ఇవ్వలేక ఓ మహిళ పుస్తెల తాడు తహశీల్దార్ కార్యాలయానికి కట్టి పెద్ద దొర, చిన్న దొరకి తగిన బుద్ధి చెప్పిందన్నారు.


Next Story

Most Viewed