కేటీఆర్‌ను ఆ ప్రశ్నలు అడగండి.. షర్మిల సంచలన కామెంట్స్

95

దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో ‘#ask కేటీఆర్‌’ కు అడగాల్సిన ప్రశ్నలు అవి కాదని వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ట్విట్టర్ వేదికగా ‘‘తెలియని ప్రశ్నలు అడిగితే పాపం కేటీఆర్ ఏం సమాధానం చెప్తాడని, తెలిసిన అసలైన ప్రశ్నలు మద్యం అమ్మకాలను పెంచడం ఎలా? ఆడవాళ్ల మాన ప్రాణాలకు హాని కలిగించటం ఎలా? జనాలను డ్రగ్స్‌కు బానిస చేయడం ఎలా? రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం ఎలా? నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునేలా చేయడం ఎలా? దళితులను మోసం చేయడం ఎలా? వరి వేసిన వాళ్లకు ఉరి వేయడం ఎలా? ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టడం ఎలా? ఉద్యమకారులను తొక్కేయడం ఎలా? ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి జైలుకు పంపించడం ఎలా? పార్టీ లీడర్లు తప్పులు చేస్తే కాపాడుకోవడం ఎలా? వీటికైతే బాగా సమాధానం చెప్పగలరు కదా చిన్న దొరగారు?’’ లాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పగలరని షర్మిల ఎద్దేవా చేశారు.

పండగ పూట సంబురాలు చేసుకోవాల్సిన రైతు ఇంకా ధాన్యం కుప్పల కాడ కాపలా ఉంటున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతులు వడ్లు ఎప్పుడు కొంటారా అని కండ్లల్లో వత్తులు వేసుకొని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరి గింజ వరకు కొంటానన్న ప్రభుత్వం వరి కోసి 3 నెలలైనా ఇంకా కొనకపోవడం వల్ల అకాల వర్షానికి ధాన్యం తడిసిపోతే, రైతులకు చావే శరణ్యం అని సీఎంపై ఫైర్ అయ్యారు.