ఈటల వస్తానంటే వెల్‌కమ్ : షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు

by  |
ఈటల వస్తానంటే వెల్‌కమ్ : షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో మళ్లీ రాజన్న రాజ్యం తీసుకువస్తానని చెప్పిన వైఎస్ షర్మిల.. బుధవారం హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ముఖ్య నేతలతో నూతన పార్టీ ఆవిర్భావ సన్నాహక సమావేశం నిర్వహించారు. పార్టీకి సంబంధించిన పలు అంశాలపై పార్టీ నేతలు, కార్యకర్తలకు షర్మిల దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజల ఆశయాలకు, ఆంక్షలకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలు రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జులై 8న పార్టీని ప్రకటించనున్నట్లు షర్మిల వెల్లడించారు.

తాము ఏర్పాటు చేయబోయే పార్టీలో కార్యకర్తలే కీలకమని.. వారికే పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ వైఎస్సార్ పార్టీ గుర్తు టేబుల్ ఫ్యాన్ అంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన ఆమె.. టేబుల్ ఫ్యాన్ గుర్తుపై ఫూలిష్ ప్రచారం అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు గుర్తు ఎంపిక పై ఎటువంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలకు అద్దం పట్టేలా తమ పార్టీ అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడుతుందని తెలిపారు.

పార్టీ ఏర్పాటుకు ఇంకా నెల రోజుల సమయం ఉన్నందున ఆలోగా కార్యకర్తలందరూ ప్రతీ గడపకు వెళ్లి.. ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవాలని సూచించారు. ప్రతి వర్గాన్ని కలవాలని షర్మిల నిర్దేశించారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలు రూపొందించాలని స్పష్టం చేశారు. తమ పార్టీ ఎజెండాను ప్రజలే రాయాలని.. ప్రతి తెలంగాణ బిడ్డ ఒప్పుకునేలా ఉండాలని అన్నారు. ప్రజల అభిప్రాయాలు, నేతలు, కార్యకర్తల ఆలోచనలను వాట్సాప్ నంబర్ 8374167039 కు పంపించాలని షర్మిల తెలిపారు.

కేసులకు భయపడే ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతున్నారని కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చే వారిపై కేసులు పెట్టడం కామన్ అని అన్నారు. ఈటల రాజేందర్ తమ పార్టీలోని వస్తానంటే ఆహ్వానిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణలో కరోనా కట్టడి విషయంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని పేర్కొన్నారు. కరోనా విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడమే సరిపోయింది.. ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని ఎద్దేవ చేశారు. కరోనాను ఎదుర్కొనే ఉద్దేశం కేసీఆర్ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed