నిందితుడిని పట్టిస్తే రూ.10 లక్షలు.. బాధితులకు రూ.20 లక్షలేనా?

by  |
నిందితుడిని పట్టిస్తే రూ.10 లక్షలు.. బాధితులకు రూ.20 లక్షలేనా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: అభం, శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై రాజు అనే నిందితుడు అత్యాచారం చేసి హత్యచేస్తే ప్రభుత్వం అతడిని పట్టించిన వారికి రూ.10 లక్షల రివార్డు ప్రకటించి బాధితులకు రూ.20 లక్షలు సాయం చేస్తామనడం సిగ్గుచేటని, ఇదేం న్యాయమని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల విమర్శలు చేశారు. లోటస్ పాండ్ లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. బాధితుల పేదరికం కారణంగానే ఘటన జరిగి ఏడు రోజులైనా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా తమ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరాహారదీక్ష చేశామన్నారు. ఆ తరువాతే ప్రభుత్వం, పోలీసుల్లో చలనం వచ్చిందని తెలిపారు.

హోంమంత్రి మహమూద్ అలీ సైతం ప్రెస్ మీట్ పెట్టారని, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కలిసి వచ్చి బాధితులకు అండగా నిలుస్తామని చెప్పారని పేర్కొన్నారు. తాము శాంతియుతంగా దీక్ష చేస్తుంటే అర్ధరాత్రి 2 గంటలకు సుమారు 200 మంది పోలీసులు వచ్చి తమ దీక్షను భగ్నం చేసి బలవంతంగా లోటస్ పాండ్ కి తరలించి హౌస్ అరెస్ట్ చేశారని షర్మిల పేర్కొన్నారు. ఈ విషయంలో పోలీసులు దొంగల్లాగా వ్యహరించారని ఆమె విమర్శించారు. శాంతియుతంగా నిరసన, దీక్ష చేసే హక్కు దేశంలో, రాష్ర్టంలో లేదా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజల పక్షాన పోరాడటం తప్పా? అని దుయ్యబట్టారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

ఆఫ్ఘన్ తాలిబన్ల చేతిలో బందీ అయినట్లు తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ చేతిలో బందీ అయిందని వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. తెలంగాణలో నియంత పాలన సాగుతోందని ప్రభుత్వానికి చురకలంటించారు. నిందితుడు ఆత్మహత్య చేసుకోవడంం ప్రభుత్వ అసమర్థత పాలనకు నిదర్శనమని, బాధితులకు.. పోలీసులు, సర్కార్ చేయలేని న్యాయం ఆ దేవుడు చేశాడని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిందితులకు కఠిన శిక్షలు వేయకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు నిత్యం చోటుచేసుకుంటున్నాయని ఆమె తెలిపారు. జగిత్యాలలో ఐదేళ్ల పాప, హైదరాబాద్ లో 9 ఏండ్ల పాపపై లైంగిక దాడికి యత్నించడమే దీనికి నిదర్శనమని ఆమె అన్నారు. ప్రభుత్వం పట్టించుకోదు, పోలీసులు పట్టుకోలేరనే ధైర్యం నేరస్తుల్లో ఉందని, అందుకే నేరస్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. దేశంలో యువత ఎలాంటి ఆశయాలు లేకుండా బతుకుతోంది. దీనికి కారణం మత్తే అని ఆమె అన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ దొరుకుతోందని, అరికట్టాల్సిన కేసీఆర్ చర్యలు తీసుకోవడం లేదన్నారు.

రాష్ట్రంలో కేసీఆర్ 3,200 బడులు మూసేశారని, 14,000 మంది టీచర్లను ఉద్యోగాల నుంచి తొలగించారని షర్మిల తెలిపారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కల్పించడంలేదని, జాబులు ఇవ్వకుండా వారిని మద్యం మత్తులో కేసీఆర్ పై ముంచుతున్నారని విమర్శలు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో మహిళలపై జరిగే అత్యాచార కేసులు 300 రెట్లు పెరిగాయని, మద్యం అమ్మకాలు సైతం 300 రెట్లు పెరిగాయని, దీనికి కారణం కేసీఆరేనని ఆమె దుయ్యబట్టారు. గల్లీకో బార్, వీధికో వైన్స్ పెట్టడం వల్ల ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతోందన్నారు. మద్యం అమ్మకాల వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, నిందితులు కూడా మహిళలపై అత్యాచారానికి పాల్పడితే తిరిగి దాడి చేసే అవకాశం ఉందని చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని నివేదికలు చెబుతున్నాయని అయినా కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఎలాంటి పాలన అందిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలని, అందరిలో చైతన్యం రావాలన్నారు. ఇది బంగారు తెలంగాణనా? బర్‌బాద్ తెలంగాణనా? అంటూ ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిందితులే ఆత్మహత్యలు చేసుకుంటారులే అని వదిలేసినప్పుడు కేసీఆర్ సీఎంగా ఉండి ఎందుకు? ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు? అని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా సరైన సమాచారం తెలుసుకోకుండా ట్వీట్ పెట్టేవాడు, ప్రజలకు సరైన న్యాయం చేయలేనివాడు ఒక మంత్రేనా అని కేటీఆర్ ను ఉద్దేశించి షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వాళ్లను మన నెత్తిన పెట్టి రుద్దుతున్నారని అన్నారు. త్వరలో 100 నుంచి 150 మద్యం షాపులు పెంచడంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కొంచెమైనా సిగ్గుండాలన్నారు. పరోక్షంగా కేసీఆర్, కేటీఆర్ ను ఉద్దేశించి వాళ్లు తాగుబోతులని ప్రజలను కూడా వాళ్లలాగే ఉండాలని కోరుకుంటున్నారని కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న దాడులపై ప్రశ్నించగా నో కామెంట్స్ అంటూ వెళ్లిపోవడం గమనార్హం.



Next Story